అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు నెలకు సంబంధించి వివిధ టికెట్ల బుకింగ్ తేదీలను ప్రకటించింది. ఆగస్టుకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, వసతి కోసం ఆన్‌లైన్ కోటాను టీటీడీ అధికారిక వెబ్‌సైట్(TTD official website)లో రేపు (మే 19న) ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఈ టికెట్ల కోసం భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్(Online)లో నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మే 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటలలోపు చెల్లింపులు పూర్తి చేస్తే లక్కీ డిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
Tirumala | 22న ఆర్జిత సేవా టికెట్లు
శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను మే 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
Tirumala | అంగప్రదక్షిణం టోకెన్లు
ఆగస్టుకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్లను మే 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మే 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో పెట్టనుంది.
Tirumala | ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా
ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. శ్రీవారి సేవ(తిరుమల, తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, టీమ్ లీడర్స్ (సీనియర్ సేవక్స్) సేవల జూలై కోటాను మే 29న ఉదయం 11 గంటలకు టీటీడీ తన వెబ్‌సైట్(Web Site)లో విడుదల చేయనుంది.