అక్షరటుడే, వెబ్‌డెస్క్: Traffic Police Station | నిజామాబాద్ నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో గురువారం ఉదయం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన బాలాజీ అనే యువకుడు పాలిటెక్నిక్ కాలేజీకి ఆనుకుని పానీ పూరి బండి నడుపుతూ జీవిస్తున్నాడు. అయితే ఇటీవల నగరానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) వచ్చిన విషయం తెలిసిందే. ఆయన సభ పాలిటెక్నిక్ గ్రౌండ్ (Polytechnic Ground)లో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు బాలాజీ పానీ పూరి బండిని అక్కడి నుంచి తీసేయించారు. అమిత్ షా పర్యటన ముగిసిన తర్వాత మళ్లీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో తన పానీపూరి బండి (Panipuri Cart) పెట్టుకుంటానని గురువారం ఉదయం బాలాజీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్(Traffic Police Station)కు వెళ్లి అడిగాడు. అయితే అందుకు పోలీసులు అనుమతించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకున్నారు.
Traffic Police Station | ఆ ఘటన మరువకముందే..
నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ యువకుడు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అర్సపల్లికి చెందిన ఓ యువకుడిని పోలీసులు గంజాయి కేసులో అదుపులోకి తీసుకోగా.. పోలీస్ స్టేషన్లో ఫినాయిల్ తాగాడు. అతడికి స్థానిక ఆస్పత్రిలో పోలీసులు చికిత్స చేయించినట్లు సమాచారం. అయితే ఆయనకు ఏమీ కాకపోవడంతో రిమాండ్‌కు తరలించారు.