అక్షరటుడే, నిజాంసాగర్ : Philippines : మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియని దుస్థితి. ఇటీవల యువకుల్లో గుండెపోటు సర్వసాధారణంగా మారింది. అమెరికాలో రెండేళ్ల క్రితం నిజామాబాద్‌కు చెందిన సాఫ్ట్ వేర్ బెడ్‌పై కూర్చున్న చోటే కుప్పకూలాడు. గతేడాది ఇంజినీరింగ్ కళాశాలో క్యాంపస్‌లో నడుచుకుంటూ వెళ్తూ మరో యువకుడు గుండె ఆగి చనిపోయాడు. తాజాగా ఓ వైద్య విద్యార్థి సైతం ఇలానే మరణించాడు.
ఫిలిప్పిన్స్ లో కామారెడ్డి జిల్లా(Kamareddy district) డోంగ్లీ మండలం(Dongli mandal ) లోని కుర్లా గ్రామానికి చెందిన వైద్య విద్యార్థి వడ్ల యోగి (23) మృతి చెందాడు. గుండెపోటుతో చనిపోయినట్లు అతడి బంధువులు తెలిపారు. పుట్టినరోజు నాడే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
వివరాల్లోకి వెళితే… డోంగ్లీ మండలం కుర్ల గ్రామానికి చెందిన యోగి.. మూడేళ్ల క్రితం ఎంబీబీఎస్ MBBS కోసం ఫిలిప్పిన్స్ వెళ్లాడు. కళాశాలకు సెలవులు ఇవ్వడంతో 3 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి 15 రోజుల కిందటే తిరిగి అక్కడికి వెళ్లాడు. బుధవారం(జులై 2) యోగి పుట్టినరోజు కావడంతో ఉదయం 8 గంటలకు అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శుభాకాంక్షలు చెప్పారు.
Philippines : పుట్టిన రోజు నాడే..
అనంతరం ఛాతీలో నొప్పి వస్తుందని యోగి తన తండ్రికి ఫోన్ చేసి చెప్పగా.. ఆస్పత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. స్నేహితుల సాయంతో ఆస్పత్రికి వెళ్తుండగా మెట్లు దిగే క్రమంలో యోగి కుప్పకూలిపోయాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు అతడి స్నేహితులు తెలిపారు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.