అక్షరటుడే, వెబ్‌డెస్క్: Yash Dayal | ఐపీఎల్ సెన్సేషన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ యశ్ దయాల్ (Yash Dayal) కెరీర్ ప్రమాదంలో పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తాజాగా అతడిపై ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh)లోని ఇందిరాపురం పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కొద్ది రోజుల క్రితం ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి.. తన మీద దయాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేయడమే కాకుండా ముఖ్యమంత్రి గ్రీవెన్స్ పోర్టల్(Chief Minister Grievance Portal)లో అతడిపై ఫిర్యాదు చేయడంతో భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణలో దయాల్ గనుక నేరం చేసినట్లు రుజువు అయితే మాత్రం అతడు జరిమానా కట్టడంతో పాటు పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
Yash Dayal | చిక్కుల్లో దయాల్..
బాధితురాలు ఫిర్యాదు ప్రకారం, 2019లో తాను యశ్ దయాల్‌ని సోషల్ మీడియా ద్వారా కలిశాను. అప్పటి నుండి ఇద్దరం కూడా చాలా సన్నిహితంగా ఉన్నాము. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి బెంగళూరు(Bangalore), ఢిల్లీ, ప్రయాగ్‌రాజ్ ప్రాంతాలకు తీసుకెళ్లాడు.. పెళ్లి చేసుకుంటానని వాగ్ధానం చేస్తూ శారీరక సంబంధాన్ని కొనసాగించాడని ఆరోపించింది. అయితే ఇప్పుడు నన్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేయడమే కాక పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని పేర్కొంది. అంతేకాదు శారీరకంగా కూడా దాడి జరిపాడని ఆమె ఆరోపించారు. బాధితురాలు ఇచ్చిన ఫొటోలు, చాట్ రికార్డులు, వీడియో కాల్ లాగ్స్ వంటి ఆధారాలు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.
యశ్ దయాల్ తనతోనే కాకుండా ఇతర సంబంధాలను కూడా కొనసాగిస్తున్నాడని ఆరోపించింది. జూన్ 14, 2025న మహిళా హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదని బాధితురాలు వాపోయారు. కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు.. యశ్ దయాల్‌ను త్వరలో అరెస్ట్ చేసి విచారించనున్నట్టు సమాచారం. ఆ తర్వాత బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది. కాగా, యశ్ IPL 2025లో RCB తరఫున మంచి ప్రదర్శన ఇచ్చారు. 13 వికెట్లు పడగొట్టారు. గతేడాది బంగ్లాదేశ్ (Bangladesh)తో జరిగిన సిరీస్‌లో భారత జట్టులో చోటు సంపాదించినప్పటికీ, అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ రాలేదు. అయితే సెక్షన్ 69 కింద ఎఫ్‌ఐఆర్ దాఖలైనందున, క్రికెట్ కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Read all the Latest News on Aksharatoday.in