అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Warangal | దేశవ్యాప్తంగా భార్యలు భర్తలను హతమారుస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు (Extramarital Affairs), ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలతో కొంతమంది మహిళలు కట్టుకున్న వాడిని కడతేరుస్తున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ, గద్వాల్ తేజేశ్వర్ హత్యలు మరువక ముందే.. ఇటీవల యాదాద్రి జిల్లాలో ఓ మహిళ తన భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేయించింది. తాజాగా మరో మహిళ తన భర్తకు కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగించి చంపింది. ఈ ఘటన వరంగల్ జిల్లా (Warangal District) వర్ధన్నపేట మండలం భవానీకుంట తండాలో చోటు చేసుకుంది.
భవానీకుంట తండా (Bhawani Kunta Thanda)కు చెందిన బాలాజీ (44) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 8న బాలాజీ చికెన్ తెచ్చి భార్యకు వండమని చెప్పాడు. తాను మద్యం తాగి వస్తానని బయటకు వెళ్లగా భార్య ఆపింది. ఇంట్లోనే మద్యం ఉందని చెప్పి.. కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి ఇచ్చింది. అది తాగిన వెంటనే బాలాజీ గొంతులో మంటతో కేకలు వేయడంతో.. ఎలాగూ చనిపోతాడని భావించి అదే తండాలోని తన బావ ఇంటికి వెళ్లిపోయింది.
Warangal | ఆస్పత్రికి తరలించిన స్థానికులు
గడ్డిమందు తాగిన బాలాజీ కేకలు వేయడంతో గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి హరిచంద్ ఫిర్యాదు మేరకు భార్యతో పాటు, ఆమె బావ దశరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో తన బావ దశరు ప్రోత్సాహంతో సదరు మహిళ భర్తను చంపినట్లు బాలాజీ తండ్రి ఫిర్యాదు చేశారు.