అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | ఒంటరి మహిళతో మాట కలిపి ఒంటిపై ఉన్న ఆభరణాలను దోచుకునేందుకు హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh chandra) తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయం(District Police office)లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు.
లింగంపేటకు చెందిన లక్ష్మి అనే మహిళ భర్త చనిపోవడంతో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేది. ఇంటి ముందు ఉన్న మసీదు నిర్మాణ పనులను ఆమెతో పాటు కన్నాపూర్‌కు చెందిన గారబోయిన శ్రీకాంత్ చేపట్టేవారు. ఈ క్రమంలో లక్ష్మితో అతడు మాటమాట కలిపి పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 21న లక్ష్మి మెడలోని ఆభరణాలను దొంగిలించాలనుకున్న శ్రీకాంత్ ఆమెతో నమ్మకంగా మాట్లాడి నీళ్లు కావాలని ఇంట్లోకి వెళ్లి చీరతో ఉరేసి హత్యకు పాల్పడ్డాడు.
అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె ఫోన్ వెంట పెట్టుకుని ఇంటికి తాళం వేసి పారిపోయాడు. లక్ష్మి కూతురు శిరీష ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన తల్లి నుంచి స్పందన లేకపోవడంతో పక్కింటి వాళ్లకు ఫోన్ చేసింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని పక్కింటివాళ్లు చెప్పగా శిరీష తన భర్తతో వచ్చి చూడగా తల్లి చనిపోయి కనిపించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు.
అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడిపై ఇప్పటికే ఒక హత్య కేసుతో పాటు 9 వివిధ కేసులు పెండింగులో ఉన్నట్లు వివరించారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్సై పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎల్లారెడ్డి డీఎస్పీ (Yellareddy DSP srinivas Rao) శ్రీనివాస్ రావు, సీఐ రవీందర్ నాయక్ ci ravindar nayak పాల్గొన్నారు.