అక్షరటుడే, కామారెడ్డి: GGH Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (Government General Hospital) సమస్యలకు నిలయంగా మారింది. ఆస్పత్రిలో పార్కింగ్ (Parking) సమస్య తలనొప్పిగా మారింది. ఆస్పత్రి లోపలికి వెళ్లే మార్గం ఇరుకుగా ఉండడం.. లోపల కార్లు, ఆటోలు పార్కింగ్ చేసి ఉంటుండడంతో అంబులెన్స్‌లు వచ్చి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగుల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
GGH Kamareddy | ఇరుకైన పార్కింగ్..
గురువారం మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి రోగులను తీసుకుని ఒకే సమయంలో మూడు 108 అంబులెన్సులు జీజీహెచ్(GGH)కు వచ్చాయి. పార్కింగ్ స్థలంలో అప్పటికే వైద్యులకు సంబంధించిన కార్లు ఉన్నాయి. బైకులు, ఆటోలతో ఆస్పత్రి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో రోగులను తీసుకుని వచ్చిన 108 వాహనాలు కనీసం అక్కడ యూటర్న్ తీసుకుని వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.
GGH Kamareddy | సెక్యూరిటీ సిబ్బందికి కష్టాలు..
ఆస్పత్రి సెక్యూరిటీ (Hospital Security) సిబ్బంది అతికష్టం మీద బైక్‌లను, ఆటోలను పంపించి 108 వాహనాల రాకపోకలకు లైన్ క్లియర్ చేశారు. జీజీహెచ్‌కు రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో పాటు వాహనాల రద్దీ కూడా పెరిగింది. ఆస్పత్రిలో పార్కింగ్ స్థలం లేక వాహనాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పార్కింగ్ విషయం సెక్యూరిటీల గార్డులకు తలనొప్పిగా మారుతోంది. కొందరు వాహనదారులు సెక్యూరిటీపైకి దాడులకు యత్నించిన ఘటనలూ ఉన్నాయి. ఆస్పత్రిలో పార్కింగ్‌ను క్రమబద్ధీకరించాలని.. అంబులెన్స్‌లు వచ్చి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.