అక్షరటుడే, వెబ్‌డెస్క్: Supreme Court | ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పనితీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఓటర్ల ముందు రాజకీయ పోరాటాలు చేయాలని, ఇందులోకి ఈడీని ఎందుకు లాగుతున్నారని అని ప్రశ్నించింది.
కర్ణాటకలో అత్యంత వివాదాస్పద మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపు కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బి.ఎం. పార్వతికి (CM Siddaramaiah Wife B.M. Parvathi) జారీ చేసిన సమన్లను హైకోర్టు రద్దు చేయడంతో ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) ఇచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
Supreme Court | రాజకీయాల్లోకి చొరబడడమెందుకు?
ఈడీ చర్యలను భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ (Justice B.R.Gavai), జస్టిస్ కె.వినోద్ చంద్రన్ (Justice K. Vinod Chandran) నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా విమర్శించింది. రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది. రాజకీయ పోరాటాలు చేయడానికి ఏజెన్సీని ఉపయోగించరాదని పేర్కొంది. “ఓటర్ల ముందు రాజకీయ పోరాటాలు చేయనివ్వండి. దాని కోసం మిమ్మల్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు?” అని సీజేఐ గవాయ్ ప్రశ్నించారు.
మహారాష్ట్రలో తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. ఈడీ(ED) గురించి కఠినమైన వ్యాఖ్యలు చేయవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. “మహారాష్ట్ర(Maharashtra)లో మాకు అనుభవముంది. మమ్మల్ని మాట్లాడాలని ఒత్తిడి చేయవద్దు. ఒకవేళ అలా చేస్తే మేము ఈడీ గురించి కఠిన నిజాలు చెప్పాల్సి వస్తుంది. ఎన్నికల్లో రాజకీయ పోరాటాలు చేసుకోనివ్వండి. కానీ అందులోకి మిమ్మల్నిఎందుకు వాడుతున్నారని” ప్రశ్నించారు. సుప్రీంకోర్టు దృఢమైన వైఖరిని చూసి ఈడీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు(Additional Solicitor General S.V. Raju) అప్పీల్‌ను ఉపసంహరించుకున్నారు.
Supreme Court | సిద్ధరామయ్యకు ఊరట..
సుప్రీంకోర్టు (Supreme Court) తాజా తీర్పు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబానికి ఎంతో ఊరట కలిగించింది. అలాగే, కొంతకాలంగా వివాదాస్పదమవుతున్న దర్యాప్తు సంస్థల పనితీరును ప్రశ్నార్థకం చేసింది. దర్యాప్తు సంస్థలను రాజకీయం చేయకుండా జాగ్రత్త వహించేలా సుప్రీం తీర్పు కనువిప్పు కలిగిస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి ఈడీ, సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు చాలా రోజులుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాదనను బలం చేకూర్చేలా సుప్రీం వ్యాఖ్యలు ఉండడం బీజేపీని ఇరుకునపెట్టేవేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.