అక్షరటుడే, వెబ్‌డెస్క్:Team India | ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్ (Edgbaston Test)లో భారత్, ఇంగ్లాండ్‌పై 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయానికి అద్భుతమైన నాయకత్వాన్ని అందించిన యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Captain Shubhman Gill) క్రికెట్ ప్రపంచాన్ని తన ఆటతీరుతో ఆశ్చర్యపరిచాడు. గిల్ ఒకే టెస్ట్‌లో ఏకంగా 430 పరుగులు చేసి 12 అసాధారణ రికార్డులను సృష్టించాడు. ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజుల రికార్డులు బ్రేక్ చేశాడు.
Team India | సరికొత్త రికార్డ్స్..
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత జట్టు(Team India) ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు చేసినా విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే, గిల్ తన తొలి సిరీస్‌లోనే ఇక్కడ ఘన విజయాన్ని సాధించి చరిత్రలో నిలిచాడు.టెస్ట్ క్రికెట్(Test cricket) చరిత్రలో ఒక్క మ్యాచ్‌లో 430 పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు గిల్. ఆసియా నుంచి మాత్రం ఇదే మొదటిసారి. గిల్ ముందు గ్రాహమ్ గూచ్ 1990లో 456 పరుగులు చేసిన రికార్డు ఉంది. 269 పరుగులతో గిల్, విరాట్ కోహ్లీ చేసిన 254 రన్ రికార్డును అధిగమించాడు. ఇది టెస్ట్ ఫార్మాట్‌లో భారత కెప్టెన్‌గా అతిపెద్ద స్కోర్. ఈ మ్యాచ్‌లో గిల్ 269 (1st ఇన్నింగ్స్), 161 (2nd ఇన్నింగ్స్) పరుగులు చేశాడు. టెస్ట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇంత భారీ స్కోర్లు చేసిన తొలి బ్యాట్స్‌మన్ ఇతనే కావడం విశేషం..
గవాస్కర్ (1979), ద్రావిడ్ (2002) తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన మూడవ భారత బ్యాట్స్‌మన్‌గా గిల్ నిలిచాడు. 269 పరుగులతో గిల్, సునీల్ గవాస్కర్ (221) రికార్డును అధిగమించి, ఇంగ్లాండ్‌లో అత్యధిక టెస్ట్ స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తొలి రెండు టెస్టుల్లోనే మూడు సెంచరీలు బాదిన రెండవ కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. అలెన్ బోర్డర్ (Allen Border) (1980) తర్వాత, ఒకే టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 150+ స్కోర్లు చేసిన రెండవ ఆటగాడిగా గిల్ నిలిచాడు. గిల్, ఈ సిరీస్‌లో మొదటి రెండు టెస్టుల్లో 585 పరుగులు చేశాడు. గ్రేమ్ స్మిత్ (621 పరుగులు, 2003) గిల్ కన్నా ముందున్నాడు. 1971లో సునీల్ గవాస్కర్ తర్వాత, ఒకే టెస్ట్‌లో సెంచరీ మరియు డబుల్ సెంచరీ చేసిన రెండవ భారతీయుడు గిల్. సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ (Virat Kohli) తర్వాత గిల్ ఒకే టెస్ట్‌లో రెండు సెంచరీలు చేసిన మూడవ భారత కెప్టెన్‌గా నిలిచాడు. గిల్ టెస్ట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో నాలుగు సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌ల్లో పాల్గొన్న తొలి భారతీయుడు, ప్రపంచంలో ఐదవ ఆటగాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటి వరకు టీమిండియాకి విజయం దక్కలేదు. ఈ గ్రౌండ్‌లో టీమిండియా 18 మ్యాచ్‌లు ఆడిన ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. కానీ గిల్ కెప్టెన్సీలోని టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది.
Read all the Latest News on Aksharatoday.in