అక్షరటుడే, వెబ్‌డెస్క్: Visakhapatnam | ఐటీ పరిశ్రమకు విశాఖపట్నం కేంద్రంగా మారుతోంది. సముద్ర తీర ప్రాంతమైన ఈ పట్టణానికి ఐటీ సంస్థలు వరుస కట్టాయి. నూతన పారిశ్రామిక విధానాలతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అద్భుతంగా ఉండడంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ వంటి సంస్థలు విశాఖ(Visakhapatnam)లో తమ కార్యాలయాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి. రానున్నరోజుల్లో మరో 15 ఐటీ కంపెనీలు కూడా ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి.
Visakhapatnam | కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఐదేళ్ల జగన్ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఐటీ రంగంపై ఫోకస్ చేసింది. అన్ని రకాలగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ఆసరాగా చేసుకుని వినూత్న రీతిలో ముందుకు సాగుతోంది. దీంతో ఐటీ సంస్థలు విశాఖ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ ఐటీ కంపెనీలు (Leading IT Companies) పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా, మరిన్ని సంస్థలు కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. భౌగోళికంగా సముద్ర తీరాన ఉండడం, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు (Bhogapuram Greenfield Airport) అందుబాటులోకి రానుండడం.. ఐటీ కంపెనీల రాకతో ముంబై తరహా కాస్మోపాలిటన్ సిటీగా విశాఖ మారుతుందని అంటున్నారు.
Visakhapatnam | కోట్లాది పెట్టుబడులు.. వేలాది కొలువులు..
విశాఖపట్నంలో భారీగా పెట్టుబడుల విస్తరణకు శ్రీకారం చుడుతున్నట్లు దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) యాజమాన్యం ఇటీవల ప్రకటించింది. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 22 ఎకరాల్లో ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. రూ.1,582 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు, దీంతో 8,000 మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. ఇక, టీసీఎస్ కూడా విశాఖకు వస్తున్నట్లు తెలిపింది. రూ.1,370 కోట్ల పెట్టుబడులతో 12,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీకి ఎకరాకు 99 పైసలు చొప్పున దాదాపు 22 ఎకరాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగ్నిజెంట్, టీసీఎస్ రాకతోనే దాదాపు 20,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. గూగుల్ కూడా విశాఖలో తమ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. మరో 15 ఐటీ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపాయి. రానున్న ఆర్నెళ్లలో ఆయా సంస్థలు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టే అవకాశముంది.