అక్షరటుడే, వెబ్‌డెస్క్:Vaibhav Suryavanshi | ‘వైభవ్ సూర్యవంశీ’ vaibhav suryavamshi ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. 14 ఏళ్ల వయసులోనే వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్(IPL) ఆడటమే కాకుండా.. మూడో ఇన్నింగ్స్‌లోనే ఈ కుర్రాడు విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 35 బంతుల్లోనే సెంచరీ బాది వరల్డ్ రికార్డ్(World Record) సాధించాడు. అయితే ఇది రాత్రికి రాత్రి వచ్చిన సక్సెస్ కాదు. ఈ కుర్రాడి విజయం వెనుక అతని తండ్రి త్యాగం.. కోచ్‌ల కష్టం.. ఎన్నో ఏళ్ల అతని కఠోర శ్రమ ఉంది.
Vaibhav Suryavanshi | కుటుంబ నేపథ్యం ఏంటంటే..?
వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని తాజ్‌పూర్ గ్రామంలో 2011 మార్చి 27న జన్మించాడు. అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక సాధారణ రైతు. ఆయనకు క్రికెట్(Cricket) అంటే పిచ్చి. క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. కానీ సాధ్యం కాలేదు. దాంతో ఆ కలను తన కొడుకు ద్వారా తీర్చుకోవాలనుకున్నాడు. నాలుగేళ్ల వయసులోనే వైభవ్ క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. తండ్రి పర్యవేక్షణలోనే క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న సూర్యవంశీ.. ఆ తర్వాత సమస్తిపూర్‌లోని ఒక క్రికెట్ అకాడమీ(Cricket Academy)లో చేరాడు.
అనంతరం మాజీ రంజీ ప్లేయర్ మనీష్ ఓఝా వద్ద శిక్షణ పొందాడు. ప్రస్తుతం వైభవ్.. బీహార్, తాజ్‌పూర్‌లోని డాక్టర్ ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్(Dr. Mukteshwar Sinha Modesty School)లో 9వ తరగతి చదువుతున్నాడు. క్రికెట్‌పై ఫోకస్ పెట్టడంతో అతని చదువుకు ఇబ్బంది కలుగుతుందని, కానీ రెండింటిని వైభవ్ బ్యాలెన్స్ చేస్తున్నాడని అతని చిన్ననాటి కోచ్ బ్రజేష్(Coach Brajesh) మీడియాకు తెలిపారు.
Vaibhav Suryavanshi | పొలం అమ్మి…
వైభవ్ సూర్యవంశీ వెనుక అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ ప్రోత్సాహం ఎంతో ఉంది. ఒక సాధారణ రైతు(Farmer) అయినప్పటికీ, తన కుమారుడు క్రికెటర్‌గా ఎదగాలనే కలను సాకారం చేయడానికి ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. వైభవ్ క్రికెట్ శిక్షణ(Vaibhav Cricket Training) ఖర్చుల కోసం తనకున్న కొంత భూమిని కూడా అమ్మేశారు. 9 ఏళ్ల వయసులో వైభవ్.. కిలోమీటర్ల మేర ప్రయాణించి పాట్నాలోని క్రికెట్ అకాడమీకి వెళ్లేవాడు. వైభవ్‌తో పాటు అతనికి బౌలింగ్ చేసే నెట్ బౌలర్లకు కూడా టిఫిన్ బాక్స్‌లు తీసుకెళ్లేవాడినని ఓ ఇంటర్వ్యూలో సంజీవ్ తెలిపారు.
Vaibhav Suryavanshi | రోజుకు 600 బాల్స్..
వైభవ్ సూర్యవంశీ ప్రాక్టీస్ చాలా కఠినంగా ఉండేదని అతని కోచ్ మనీష్ ఓఝా(Coach Manish Ojha) తెలిపారు. ఉదయం 7.30 నుంచి శిక్షణ ప్రారంభించేవాడని, ప్రతీ రోజు 600 బంతులు ఆడేవాడని చెప్పారు. ఈ కఠినమైన దినచర్య నాలుగేళ్ల పాటు కొనసాగిందన్నారు. ఐపీఎల్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) నిర్వహించిన నాలుగు శిక్షణ శిబిరాల్లో వైభవ్ సూర్యవంశీ పాల్గొన్నాడు. టాలెగావ్‌లోని అత్యాధునిక అకాడమీలో కూడా శిక్షణ పొందాడు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడానికి వీలుగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే సైడ్-ఆర్మ్ త్రోడౌన్(Side-Arm Throwdown)లను కూడా ప్రాక్టీస్ చేసేవాడు. ఈ కఠినమైన శిక్షణ కారణంగానే ఐపీఎల్(IPL)లో అతను 250 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు.
Vaibhav Suryavanshi | ఆస్ట్రేలియాపై సెంచరీ..
ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో జరిగిన యూత్ టెస్ట్‌లో సూర్య వంశీ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. 58 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో బిహార్ తరఫున రంజీ ట్రోఫీ(Ranji Trophy)లోకి అరంగేట్రం చేశాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే రంజీ క్రికెట్ ఆడి చరిత్ర సృష్టించాడు.
Vaibhav Suryavanshi | వేలంలో కోటి..
తమ ప్రాక్టీస్ క్యాంపుల్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) రూ. కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది. సంజూ శాంసన్(Sanju Samson) గాయంతో జట్టుకు దూరమవడంతో తుది జట్టులో అవకాశం కల్పించింది. లక్నోతో మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సూర్యవంశీ.. తొలి బంతినే సిక్సర్‌గా తరలించి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. ఆర్‌సీబీ(RCB)తో విఫలమైనా.. రెండు భారీ సిక్స్‌లు బాదాడు. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరిగిన తాజా మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 38 బంతుల్లో 11 సిక్సర్లు, 7 ఫోర్లతో 101 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి 50.33 సగటు, 215.71 స్ట్రైక్‌రేట్ తో 151 పరుగులు చేశాడు.