అక్షరటుడే, వెబ్‌డెస్క్: bangalore stampede | బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium)లో RCB విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్(Allu Arjun) ట్రెండ్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది.
Pushpa 2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. ఆ తొక్కిసలాటలో ఓ మహిళ(35 ) మరణించింది. ఈ ఘటనకు అల్లు అర్జున్ కారణమనే ప్రధాన ఆరోపణ. మరి బెంగళూరు తొక్కిసలాట ఘటనకు ఎవరిని బాధ్యులు చేస్తారంటూ.. ప్రస్తుతం నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన RCB విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయాలపాలయ్యారు.
ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్‌కు సంబంధించిన తొక్కిసలాట ఘటన 2024 డిసెంబరులో హైదరాబాద్(Hyderabad)లోని సంధ్య థియేటర్(Sandhya Theater)లో ‘పుష్ప 2’ ప్రీమియర్ సందర్భంగా చోటుచేసుకుంది. ఈ ఘటనలో 35 ఏళ్ల మహిళ మరణించారు. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అనంతరం షరతులతో కూడిన బెయిల్‌పై విడుదల చేశారు.
బెంగళూరు ఘటనతో అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేకున్నా.. ఆర్సీబీ విజయోవత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటను ప్రధాన అస్త్రంగా నెటిజన్లు తీసుకున్నారు. “అల్లు అర్జున్ ఘటనలో ఒక్క మహిళ మరణించినందుకే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు(Congress government) అగ్గిమీద గుగ్గిలం అయింది.. అది రాష్ట్ర ప్రజలందరి సమస్యగా.. ఏకంగా అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ప్రస్తావించారు.. మరి బెంగళూరులో ఇంత పెద్ద ఘటన జరిగింది కదా.. మరి కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది..?” అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ సోషల్ మీడియాలో చూసినా ఈ రెండు ఘటనలనే పోల్చుతూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ తాజా ఘటనపై కర్ణాటక ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.