అక్షరటుడే, వెబ్‌డెస్క్: Train tickets : దాదాపు ఐదేళ్ల తర్వాత భారత రైల్వే శాఖ IRCTC ప్రయాణికులపై ఛార్జీల భారం మోపే నిర్ణయం తీసుకుంది. కొత్తగా పెంచిన ఛార్జీలు 1 జూలై 2025 నుంచి అమలులోకి వచ్చాయి. రైల్వేశాఖ ఛార్జీలు పెంచడంతోపాటు మరికొన్ని మార్పులు తీసుకువచ్చింది.
తత్కాల్ టికెట్ బుకింగ్ Tatkal ticket booking కోసం ఆధార్‌ను అనుసంధానం చేసింది. అంతే కాకుండా ఛార్ట్ ప్రిపరేషన్ కూడా ట్రైన్ బయల్దేరడానికి 8 గంటల ముందు చేయనున్నట్లు తెలియజేసింది. అయితే, 2020లో చివరిసారిగా టికెట్ ఛార్జీలు సవరించగా, దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ ధరల పెంచడం జరిగింది.
ఎలాంటి మార్పులు జరిగాయి అనేది చూస్తే.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ తరగతులు: కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెంపు, నాన్ ఏసీ తరగతులు: కిలోమీటరుకు 1 పైసా చొప్పున పెంపు, స్లీపర్, ఫస్ట్ క్లాస్ ఆర్డినరీ: కిలోమీటరుకు అర పైసా (0.5 పైసలు) చొప్పున పెంచారు.
Train tickets : ఛార్జీలు పెరుగుదల..
సెకండ్ క్లాస్ ఆర్డినరీకి 500 కిలో మీటర్ల వరకు సాధారణ ఛార్జీలే ఉండనున్నాయని రైల్వే శాఖ ప్రకటించింది. మరోవైపు 501 కిలోమీటర్ల నుంచి 1,500 కిలోమీటర్ల వరకు టికెట్‌పై రూ.5 పెంచారు. ఇక 1.501 కిలోమీటర్ల నుంచి 2,500 కిలోమీటర్ల వరకు రూ.10 పెంపు, 2501 కిలోమీటర్ల నుంచి 3 వేల కిలోమీటర్ల వరకు టికెట్‌పై రూ.15 చొప్పున పెంచారు. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Rajdhani, Shatabdi, Duronto, Vande Bharat Express) వంటి ప్రీమియం రైళ్లకు కూడా ఈ మార్పులు వర్తిస్తాయని రైల్వే శాఖ తెలియజేసింది. సబర్బన్, సీజన్ టిక్కెట్లలో ఎటువంటి మార్పులు లేవని రైల్వేశాఖ Railway వెల్లడించింది.
సబర్బన్ సింగిల్ జర్నీ టిక్కెట్లు, నెలవారీ సీజన్ టిక్కెట్లు (MSTలు), రిజర్వేషన్, సూపర్‌ఫాస్ట్ ఫీజులు వంటి అనుబంధ ఛార్జీలలో ఎలాంటి మార్పులు లేవని మంత్రిత్వ శాఖ తేలియజేసింది. అయితే, ప్రస్తుత నిబంధనల ప్రకారం GST వర్తిస్తుందని మాత్రం వెల్లడించింది. జూలై 1కి ముందు బుక్ చేసుకున్న టిక్కెట్లపై ఎక్స్‌ట్రా ఛార్చీలు ఉండవని కూడా తెలిపింది.
కాగా, మార్పుల కారణంగా జూలై 30 రాత్రి 9 గంటల నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌లో సమస్యలు తలెత్తాయి. డబ్బులు కట్ అయినా సరే టికెట్‌లు కన్ఫామ్ కాకపోవడంతో ప్రయాణికులు కాస్త గందరగోళానికి గురయ్యారు. ఇక జూలై 15 నుంచి అడ్డగోలుగా ఏజెంట్లు చేసే రిజర్వేషన్ దందాకు అడ్డుకట్ట వేసే క్రమంలో OTP-ఆధారిత ఆధార్ ప్రామాణీకరణను సిస్టమ్‌ను ప్రవేశ పెట్టనున్నారు.