అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trade War | ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అనేక ఆంక్షలు విధించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆ దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించాలనే ప్లాన్ వేస్తోంది.
ఈ క్రమంలోనే మాస్కో(Moscow)తో వ్యాపారం కొనసాగిస్తే భారీ సుంకాలు వడ్డిస్తామని నాటో హెచ్చరించింది. వందశాతం శాతం టారిఫ్‌లు విధిస్తామని భారతదేశం, చైనా, బ్రెజిల్‌లను నాటో సెక్రెటరీ జనరల్ మార్క్ రుట్టే (NATO Secretary General Mark Rutte) బుధవారం బెదిరించారు. నాటోలో చేరవద్దని ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించిన రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఎగుమతులపై ప్రభావం పడడంతో రష్యా చౌక ధరకే ముడిచమురును విక్రయిస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకుని ఇండియా, చైనా ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా ఉత్పత్తి చేస్తున్న చమురులో ఈ రెండు దేశాలే 86 శాతం కొనుగోలు చేస్తున్నాయి. మాస్కోకు అత్యధికంగా చమురు నుంచే ఆదాయం లభిస్తున్న దరిమిలా దాన్ని కట్టడి చేసేందుకు అమెరికా (America) ప్రయత్నిస్తోంది.
Trade War | శాంతి చర్చలకు రమ్మని చెప్పండి..
రష్యా(Russia)తో వ్యాపారం చేస్తే అత్యధిక సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాటో సెక్రెటరీ రుట్టే స్పష్టం చేశారు. ఇండియా, చైనా, బ్రెజిల్ దేశాల అధ్యక్షులు అతని (పుతిన్)తో మాట్లాడి ఉక్రెయిన్(Ukraine)తో శాంతి ఒప్పందం చేసుకోవడానికి ఒత్తిడి చేయాలని సూచించారు. అమెరికా సెనెటర్లతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడారు.
ఇండియా, చైనా, బ్రెజిల్ సహా ఇతర దేశాలు మాస్కో నుంచి చమురు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ప్రధానంగా ఈ మూడు దేశాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin)తో మాట్లాడి ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందాన్ని చేసుకోవడానికి ఆయనను ఒప్పించాలని కోరారు.
“ఈ మూడు దేశాలు రష్యాతో వ్యాపార సంబంధాలు తగ్గించుకోవాలి. లేదంటే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వంద శాతం సుంకాలు విధిస్తాం. మాస్కోలోని ఆ వ్యక్తి(పుతిన్)కు ఫోన్ చేసి శాంతి చర్చలు జరపాలని, ఒప్పందం చేసుకోవాలని అతడికి చెప్పండి” అని రుట్టే పేర్కొన్నారు. ఉక్రెయిన్ కోసం దీర్ఘ-శ్రేణి క్షిపణులు అందించడంపై చర్చలు జరుగుతున్నాయా? అని ప్రశ్నించగా, లేదని బదులిచ్చారు.