అక్షరటుడే, వెబ్‌డెస్క్: చైత్ర మాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి ని వరూధిని ఏకాదశిగా పేర్కొంటారు. నేడు(ఏప్రిల్ 24, 2025) వరూధిని ఏకాదశి. ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున కొన్ని పూజలు చేస్తే.. ఎంతో పుణ్యఫలమంటున్నారు వేద పండితులు. భవిష్యోత్తర పురాణంలో చెప్పినట్లుగా ఈ రోజున ఏకాదశి వ్రతం చేస్తే 10 వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం దక్కుతుందంటున్నారు.
‘వ్రతం అంటే రోజు వారీ పూజలు చేయడంతో పాటు రోజంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉండాలి. మరుసటి రోజు ఉదయం ఎవరికైనా భోజనం పెట్టిన తర్వాతే తినాలి. దీనినే ఏకాదశి వ్రతం అంటారని పండితులు చెబుతున్నారు.
వరూధిని ఏకాదశి రోజున ప్రత్యేక దానాలు చేస్తే.. సూర్యగ్రహణ సమయంలో బంగారం దానం చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. ఉపవాసం ఉండటం కుదరని వాళ్లు.. నీటి కుండను దానం చేసినా అదే ఫలితం లభిస్తుందంటున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆహారం, ప్రసాదం, మంచి నీళ్లు పంచి పెట్టడం వల్ల అద్భుత ఫలితాలు దక్కుతాయంటున్నారు.
Varudhini Ekadashi : ఎవరికి పూజ చేయాలంటే..
వరూధిని ఏకాదశి రోజున వామనుడిని పూజిస్తే ఎంతో పుణ్యఫలమని వేద పండితుల మాట. వీలైతే “దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతి కారిణే ప్రభవే సర్వ దేవానాం వామనాయ నమో నమః” శ్లోకం చదువుకోవాలని చెబుతున్నారు. ఇంత పెద్ద శ్లోకం చదవలేని వారు “ఓం బాల వామన రూపిణే శ్రీ మహా విష్ణవై నమః” లేదా “ఓం వామనాయ నమో నమః” అని స్మరించుకుంటూ దీపం పెట్టుకుంటే సరిపోతుందని వివరిస్తున్నారు.
కుబేరుడి ఆస్థానంలో నాట్యం చేసే వరూధిని అనే దేవకన్య.. ఏకాదశి వ్రతం చేయడం వల్ల శాప విముక్తి పొందిందనేది పురాణ కథనం. వరూధిని ఏకాదశి నాడు పసుపు రంగు పండ్లను పేదలకు పంచి పెడితే ఏళ్ల నాటి సమస్యల నుంచి విముక్తి కావొచ్చని చెబుతుంటారు.
అష్టైశ్వర్యాలు కలగాలంటే లక్ష్మీదేవి లేదా విష్ణమూర్తి విగ్రహానికి కుంకుమ పువ్వు / కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజున వైష్ణవాలయాలైన కృష్ణుడు, రాముడు, వేంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహ ఆలయాలను దర్శించాలని, ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించాలని సెలవిస్తున్నారు. అనంతరం “ఓం నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం వామనాయ నమః” అంటూ సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే కష్టాలు తొలగిపోతాయని వివరిస్తున్నారు.