అక్షరటుడే, వెబ్డెస్క్: Wine Shop | వైన్ షాప్ తలుపులు మూసి ఉన్నాయి. తాళం సరిగ్గా వేసి ఉంది. పైకప్పుసరిగ్గానే ఉంది. చుట్టూ పటిష్టమైన భద్రత ఉంది. అయినా దుకాణంలో ఉంచిన రూ.25,000 నగదు మాయమైంది. కాగా.. దొంగ చోరీకి పాల్పడిన వీడియోను చూస్తే నోరెళ్లబెడతారు. ఈ సంఘటన మహారాష్ట్ర(Maharashtra)లోని నాగ్‌పూర్ పట్టణంలో చోటుచేసుకుంది. నగరంలోని ఓ వైన్ షాప్‌లో రాత్రి సమయంలో చిన్న కౌంటర్ గ్రిల్ రంధ్రం(Counter grill hole) నుంచి దొంగ తల దూర్చి, తన శరీరాన్ని తిప్పుతూ, అచ్చం సూపర్ హీరోలా ఆ లోపలికి చొరబడ్డాడు.
Wine Shop | కౌంటర్ గ్రిల్ నుండి..
వైన్ షాప్ లోపలికి ప్రవేశించిన దొంగ దుకాణంలోని కౌంటర్ నుంచి రూ.25,000 నగదును తీసుకొని అదే రంధ్రం ద్వారా మళ్లీ బయటకు వచ్చాడు. ఇవన్నీ కేవలం కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయాయి. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్(CCTV Footage) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ఈ దొంగ చాలా స్మార్ట్ గురూ అని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు డొరేమాన్ కార్టూన్ స్టైల్‌లో చేశాడని, ఇంకొందరు ఇతనిని ఢిల్లీ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించాలి అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.
దుకాణ యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. షాపు యజమాని ప్రతి రోజు మాదిరిగానే రాత్రి షాప్‌ను మూసి, తాళం వేసి వెళ్లిపోయాడు. కానీ ఆ రోజు ఉదయం వచ్చి చూసేసరికి నగదు మాయమైపోయింది. స్థానిక పోలీసులు(Maharashtra Police) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటన సాధారణ తాళాలు, గేట్లతో సరిపెట్టుకున్నా సురక్షితం కాదన్నదానికి నిదర్శనంగా మారింది. చిన్న రంధ్రాల నుంచి కూడా దొంగలు లోపలికి చొరబడుతున్న సందర్భాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దుకాణాలు కలిగి ఉన్నవారు మరింత అధునాతన భద్రతా పద్ధతులు అవలంబించాలని పోలీసులు సూచిస్తున్నారు.