అక్షరటుడే, వెబ్‌డెస్క్: Credit Cards | ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ అనేది డెబిట్ కార్డ్ అంత సాధారణంగా మారింది. ఉద్యోగులు, వ్యాపారులేకాదు.. సాధారణ ప్రజల వద్దా క్రెడిట్ కార్డులుంటున్నాయి. కొందరు ఒకటికి మించి కూడా కార్డులు కలిగి ఉంటున్నారు. ఆన్‌లైన్ షాపింగ్(Online shopping)లో ఆఫర్లతోపాటు ఆఫ్‌లైన్‌లోనూ క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్లు(Reward points), ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ లభిస్తుండడంతో చాలా మంది వీటిని వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.
కొన్ని సంస్థలు ఎలాంటి వార్షిక ఫీజులు(Annual fee) కూడా వసూలు చేయడం లేదు. మరికొన్ని కార్డులపై నిర్ణీత మొత్తం వినియోగం తర్వాత వార్షిక ఛార్జీ ఉండదు. మరికొన్ని కార్డులు మాత్రం సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఆహ్వానం ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇవి విలాసవంతమైన జీవనశైలిని అందించడమే కాకుండా ప్రత్యేకమైన ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వాటి ఆన్యువల్ ఫీజులు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డుల గురించి తెలుసుకుందామా..
Credit Cards | అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ కార్డ్..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డులలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ కార్డ్ (The American Express Centurion Card) ఒకటి. దీనిని అమెక్స్ బ్లాక్ కార్డ్ (Amex Black Card) అని పిలుస్తారు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్ దీనిని జారీ చేస్తుంది. ఇది అందరికీ అందుబాటులో ఉండదు. అధిక ఆదాయం, ఖర్చు అలవాట్లు ఉన్నవారికి మాత్రమే దీనిని జారీ చేస్తారు.
దీనికి అర్హత సాధించాలంటే ఏటా రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసే సామర్థ్యం ఉండాలి. అమెరికన్ ఎక్స్ ప్రెస్ సెంచూరియన్ కార్డ్‌తో ప్రపంచ స్థాయి హోటళ్లలో బస, ప్రైవేట్ జెట్(Private Jet) సేవలు, ఎయిర్‌పోర్ట్‌లలో వీఐపీ ట్రీట్‌మెంట్ వంటి అల్ట్రా లగ్జరీ సదుపాయాలు లభిస్తాయి. భారత్‌లో ఈ కార్డ్ ఇనిషియేషన్ ఫీజు రూ. 7 లక్షలు, జాయినింగ్ ఫీజు కింద రూ.2.75 లక్షలు వసూలు చేస్తున్నారు. దీనికి జీఎస్టీ అదనం. వార్షిక రుసుము రూ. 2.75 లక్షలు జీఎస్టీతో కలుపుకొంటే రూ. 3,24,500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కార్డు ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది వద్దే ఉంది. ఇక మన దేశంలో 200 మంది వద్దే ఉన్నట్లు తెలుస్తోంది.
Credit Cards | జేపీ మోర్గాన్ ఛేస్ పల్లాడియం కార్డ్..
జేపీ మోర్గాన్ ఛేస్ పల్లాడియం కార్డ్‌నే జేపీ మోర్గాన్ రిజర్వ్ కార్డ్(J.P. Morgan Reserve Card) అని కూడా అంటారు. ఈ కార్డ్ కూడా అత్యంత ధనవంతుల కోసం రూపొందించబడింది. ఆహ్వానం ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిని పల్లాడియం (Palladium) లోహంతో తయారు చేస్తారు.
ఈ కార్డు కలిగి ఉన్నవారికి ప్రైవేట్ బ్యాంకింగ్ సేవలు, ప్రత్యేక ట్రావెల్ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. అధిక క్రెడిట్ లిమిట్, రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజరీ సేవలు కూడా అందిస్తుంది. జేపీ మోర్గాన్‌లో గణనీయమైన ఆస్తులు (సాధారణంగా 10 మిలియన్ డాలర్లకంటే ఎక్కువ) ఉన్నవారికి జారీ చేస్తారు. వార్షిక ఫీజుగా 595 డాలర్లు వసూలు చేస్తుంది.
Credit Cards | దుబాయ్ ఫస్ట్ రాయల్ మాస్టర్ కార్డ్..
దుబాయ్ ఫస్ట్ రాయల్ మాస్టర్ కార్డ్ (Dubai First Royale Mastercard) దుబాయ్‌లో రూపొందించబడింది. దీనిలో బంగారం, వజ్రాలను ఉపయోగిస్తారు. ఇది మధ్యప్రాచ్యంలోని ధనవంతులకోసం జారీ చేస్తుంది. విలాసవంతమైన షాపింగ్, ట్రావెల్ సేవలు అందిస్తుంది. క్రెడిట్ లిమిట్‌పై ఎటువంటి పరిమితి ఉండదు. అధిక నికర విలువ ఉన్న వ్యక్తులకు మాత్రమే ఆహ్వానం ద్వారా అందుబాటులో ఉంటుంది. 5 వేల డాలర్ల వరకు వార్షిక రుసుము వసూలు చేస్తారు.
Credit Cards | వీసా ఇన్ఫినిట్ కార్డ్..
కొన్ని దేశాలలో వీసా ద్వారా జారీ చేసే వీసా ఇన్ఫినిట్ కార్డ్ (Visa infinite card) ప్రీమియం సేవలను అందిస్తుంది. అధిక ఆదాయం ఉన్నవారికి ఈ కార్డు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్‌ను బట్టి వార్షిక ఫీజు 400 డాలర్లనుంచి 1,000 డాలర్ల వరకు వసూలు చేస్తారు. ఈ కార్డుపై ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ట్రావెల్ ఇన్సూరెన్స్‌తోపాటు రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.