అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ (Air India CEO Campbell Wilson) కీలక ప్రకటన చేశారు. విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇటీవల ప్రాథమిక నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. దీనిపై సీఈవో తాజాగా స్పందించారు.
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలు దేరిన విమానం జూన్ 12న టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 270 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ఏఏఐబీ(AAIB) విచారణ చేపట్టి ఇటీవల ప్రాథమిక నివేదిక అందజేసింది. నివేదికపై ఎయిరిండియా సీఈవో స్పందిస్తూ విమానంలో ఎలాంటి లోపం లేదని స్పష్టమైందన్నారు.
Ahmedabad Plane Crash | స్విచ్‌లు ఆగిపోవడంతో..
విమానంలోని రెండు ఇంధన స్విచ్‌లు (Fuel switches) ఆగిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ఏఏఐబీ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ మేరకు స్విచ్‌లు ఎందుకు ఆపేశావని ఓ పైలెట్ ప్రశ్నించగా.. తాను ఆ పని చేయలేదని మరో పైలెట్ అన్నట్లు కాక్‌పిట్(Cockpit)లో రికార్డు అయింది. అనంతరం ప్రమాదం జరిగింది.
ఎయిర్ ఇండియా సీఈవో మాట్లాడుతూ.. మెయింటెనెన్స్ పనులు పూర్తి చేశామని నివేదికలో ఉందన్నారు. ఇంధన నాణ్యతలో కూడా ఎలాంటి లోపం లేదని, బ్రీత్ అనలైజర్ టెస్టులో పైలట్లు పాస్ అయ్యారని తెలిపారు. విమాన ప్రమాదం(Plane Crash) తర్వాత డీజీసీఏ పర్యవేక్షణలో బోయింగ్ 787 విమానాలను తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. ఇంధన స్విచ్‌లపై వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం అని ఆయన కొట్టిపారేశారు.
Ahmedabad Plane Crash | కొన్ని రోజుల ముందే తనిఖీ
ప్రమాదంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇంకా దర్యాప్తు ముగియలేదని.. ముందుగానే లేనిపోని కథనాలు ప్రచారం చేయొద్దని విల్సన్ కోరారు. ప్రమాదానికి కొన్ని రోజుల ముందే విమానాన్ని తనిఖీ చేశామని ఆయన తెలిపారు.