అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ujjaini Mahankali Bonalu | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా ప్రతి సంవత్సరం రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం రంగం కార్యక్రమం చేపట్టగా.. మాతంగి స్వర్ణలత(Matangi Swarnalata) భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది మహమ్మారి ముప్పు పొంచి ఉందని ఆమె హెచ్చరించారు.
మహంకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా రంగం కార్యక్రమం(Rangam Program) చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెబుతారు. ఆమె చేత అమ్మవారే భవిష్యవాణి పలికిస్తారని భక్తుల విశ్వాసం. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత మాట్లాడుతూ.. ఈ ఏడాది అగ్ని ప్రమాదాలు(Fire Accidents) ఎక్కువగా జరుగుతాయని హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు.
Ujjaini Mahankali Bonalu | సమృద్ధిగా వర్షాలు
ఈ ఏడాది రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని స్వర్ణలత తెలిపారు. పిల్లలను విచ్చలవిడిగా వదిలేస్తున్నారని.. వారిని తాను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ ఏడాది చాలా సంతోషంగా పూజలు చేశారన్నారు. ప్రజలందరిని సంతోషంగా సమానంగా చూస్తానని భవిష్యవాణిలో తెలిపారు.
Ujjaini Mahankali Bonalu | అమ్మవారికి అన్ని పూజలు చేస్తాం
మహంకాళి అమ్మవారి ఆలయం(Mahakali Temple) వద్ద నిర్వహించిన రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహంకాళి బోనాలు వైభవంగా జరిగాయన్నారు. అమ్మవారికి జరగాల్సిన అన్ని పూజలు చేస్తామని పేర్కొన్నారు. అమ్మవారు కోరుకున్నట్టు బలి విషయంలో కూడా ప్రభుత్వం కచ్చితంగా ఆలోచన చేస్తుందన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతామని తెలిపారు.