అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rahul Gandhi | లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తనను మాట్లాడనీయడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిగా తనకు సభలో మాట్లాడే హక్కు ఉందని, తనను సభలో మాట్లాడటానికి అనుమతించలేదని తెలిపారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన సభ్యులకు మాత్రం అవకాశమిస్తున్నారని, తనకు మాత్రం ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Monsoon Sessions) సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలిరోజే గందరగోళం నెలకొంది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై చర్చకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభ్యుల నిరసనతో సభలో గందరగోళం నెలకొనడంతో రెండుసార్లు వాయిదా పడింది. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో రాహుల్‌గాంధీ(Rahul Gandhi) విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Rahul Gandhi | నాకు అనుమితివ్వలేదు..
సభలో మాట్లాడేందుకు తన అభిప్రాయాలు చెప్పేందుకు అనుమతి ఇవ్వడం లేదని రాహుల్‌గాంధీ తెలిపారు. రక్షణశాఖ మంత్రి(Defense Minister), ఇతర బీజేపీ సభ్యులకు మాట్లాడడానికి అనుమతి ఉంటుంది. కానీ ప్రతిపక్షం నుంచి ఎవరైనా ఏదైనా చెప్పాలంటే మాత్రం వారికి అనుమతి ఉండదని ఆక్షేపించారు. ప్రతిపక్ష నాయకుడిగా తన అభిప్రాయాలు చెప్పడం తన హక్కు అని తెలిపారు. కానీ తనకు అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం(NDA Government) తనకు అనుకూలంగా కొత్త విధానాలను సృష్టించుకుంటోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చర్చలు ప్రారంభమయ్యేలోపు సభ నుంచి బయటకు వెళ్లిపోయారని ఆక్షేపించారు.
Rahul Gandhi | చర్చకు సిద్ధంగా లేరు..
ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదని రాహుల్‌గాంధీ ఆరోపించారు. అందుకే సభను వాయిదా వేసుకుంటూ పోతోందన్నారు. “వారు అనుమతిస్తే చర్చ జరుగుతుంది, కానీ సమస్య ఏమిటంటే ప్రభుత్వంలోని వ్యక్తులు ఏదైనా చెబితే, మాకు కూడా అవకాశం ఇవ్వాలి. కానీ ప్రతిపక్షాన్ని అనుమతించలేదు” అని ఆయన ఆరోపించారు.
Rahul Gandhi | పహల్గామ్, విమాన ప్రమాద మృతులకు నివాళి
వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగానే లోక్‌సభ (Lok Sabha) పలువురికి నివాళులర్పించింది. ఇటీవల కాలంలో మరణించిన ఎనిమిది మంది మాజీ ఎంపీలకు నివాళులర్పించింది. అలాగే, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి, జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారికి కూడా సభ నివాళులర్పించింది. భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి 18 రోజులు గడిపిన తర్వాత తిరిగి వచ్చిన ఇటీవలి విజయవంతమైన అంతరిక్ష యాత్ర గురించి కూడా స్పీకర్ ప్రస్తావించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, శుక్లాను కూడా ఆయన అభినందించారు. ఈ సమావేశంలో అంతరిక్ష యాత్రపై కూడా సభలో వివరణాత్మక చర్చ జరుగుతుందని బిర్లా చెప్పారు.