అక్షరటుడే, వెబ్‌డెస్క్: Anil Kumar Yadav | ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో (liquor scam case) మిథున్ రెడ్డిని (Mithun Reddy) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఆయన అరెస్టుపై వైసీపీ భగ్గుమంటోంది. నిరాధార ఆరోపణలతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని స్కాంలో అంటూ ఇరికించారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న క్వార్ట్జ్ కుంభకోణం కేసు వ్యవహారంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (former minister Anil Kumar Yadav), మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Anil Kumar Yadav | అనీల్ కుమార్ చుట్టూ ఉచ్చు..
విచారణలో శ్రీకాంత్ రెడ్డి కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు పెద్దఎత్తున అక్రమాలు వెలికితీస్తున్నారు. ముఖ్యంగా గూడూరు, సైదాపురం, చిల్లకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల క్వార్ట్జ్ మాఫియా అక్రమ వసూళ్లు సాగించినట్లు పోలీసులు గుర్తించారు. అనుమతులు లేకుండా తవ్విన టన్నుల కొద్దీ క్వార్ట్జ్ పై రూ. 7,000 నుంచి రూ. 10,000 వరకు మామూళ్లు వసూలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మొత్తాలతో శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ భాగస్వామ్యంతో స్థిరాస్తి వ్యాపారాలు (real estate business) ప్రారంభించినట్లు విచారణలో తేలింది.
గూడూరు- చెన్నూరు రోడ్డులో 100 ఎకరాల్లో “గ్రీన్ మెడోస్” పేరుతో వెంచర్, నాయుడుపేట హైవే పరిధిలో 50 ఎకరాల్లో “స్వర్ణముఖి స్మార్ట్ సిటీ, హైదరాబాద్ (Hyderabad) మణికొండ అల్కాపురిలో “హెవెన్లీ హోమ్స్” పేరుతో హౌసింగ్ ప్రాజెక్ట్, తుర్కయాంజల్ వద్ద “గ్రీన్ మెడోస్ హౌసింగ్ కన్‌స్ట్రక్షన్స్” అనే పేరుతో మరో నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులన్నీ (Projects) అక్రమంగా సంపాదించిన సొమ్ముతో తీసుకున్నవని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం మరిన్ని ఆధారాలు వెలికితీసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసు నేపథ్యంలో వైసీపీపై (YSRCP) రాజకీయ ఒత్తిడులు పెరుగుతున్నాయి.