అక్షరటుడే, వెబ్‌డెస్క్: MGM Hospital | వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఓ ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిదంటే.. కుమారస్వామి అనే వ్యక్తి చనిపోయాడని అనుకొని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తీరా.. ఆ మృతదేహం అతడిది కాదని గుర్తించి తిరిగి మార్చురీకి తరలించారు. కుమారస్వామి మృతదేహం అప్పగించాలని అధికారులను కోరారు. అయితే సదరు కుమార స్వామి చనిపోలేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలియడంతో సంతోషం వ్యక్తం చేశారు.
MGM Hospital | అసలు ఏం జరిగిందంటే..
వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం మైలారం గ్రామానికి (Mylaram Village) చెందిన గోక కుమారస్వామి(50), రమ దంపతులకు ఓ కుమార్తె ఉంది. అయితే ఈ దంపతులు విభేదాలతో 20 ఏళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో రమ మైలారంలో ఉంటుండగా.. కుమారస్వామి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు (Mahabubabad District Thorrur)లో ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం తొర్రూరు బజాజ్ షోరూం సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి (MGM Hospita)కి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. అయితే చనిపోయిన వ్యక్తి కుమార స్వామి అనుకొని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
MGM Hospital | పచ్చబొట్టు లేకపోవడంతో..
పోలీసులు సమాచారం ఇవ్వడంతో కుమార స్వామి కుటుం బ సభ్యులు ఎంజీఎం మార్చురీ నుంచి మృతదేహాన్ని తీసుకు వెళ్లారు. గ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే కుమారస్వామి చేతిపై శ్రీ అనే పచ్చబొట్టు ఉండేది, మృతదేహంపై లేకపోవడాన్ని గమనించారు.
దీంతో కుమార స్వామి మృతదేహానికి బదులు వేరకొరిది ఇచ్చారని ఆస్పత్రిలో తిరిగి ఇచ్చేశారు. కుమారస్వామి మృతదేహం కోసం అడగ్గా అధికారులు శనివారం రావాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ఈ రోజు ఆస్పత్రికి వెళ్లాగా.. కుమారస్వామి బతికే ఉన్నాడని తెలిసింది. చికిత్స పొందుతున్నాడని సిబ్బంది తెలపడంతో కుటుంబ సభ్యులు ఆనంద పడ్డారు.