అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tiger Conservation | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొమురం భీమ్ కన్జర్వేషన్ కారిడార్ (Komuram Bheem Conservation Corridor) ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో నంబర్ 49 (G.O. 49)ను నిలిపివేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోపై ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దానిని నిలిపివేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు.
Tiger Conservation | అసలు ఏమిటీ ఈ జీవో
తెలంగాణ ప్రభుత్వం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు కోసం జీవో 49 తీసుకొచ్చింది. టైగర్ కన్జర్వేషన్ (Tiger Conservation) కోసం పలు గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ జీవోతో ఆదివాసీ గ్రామాలు కనుమరుగవుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
Tiger Conservation | ఆందోళనలు చేపట్టిన ఆదివాసీలు
జీవో 49తో వందలాది గ్రామాలను ఖాళీ చేయించనున్నారని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. జులై 21 (సోమవారం) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ నిర్వహించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదివాసీల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని జీవోను నిలిపివేయాలని నిర్ణయించింది.
Tiger Conservation | మావోయిస్టుల పేరిట లేఖ
జీవో 49కు వ్యతిరేకంగా గతంలో మావోయిస్టుల పేరిట లేఖ కూడా విడుదలైంది. ఈ జీవోతో ఆసిఫాబాద్ జిల్లాలోని 339 గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. మే 5న తీసుకొచ్చిన ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా.. తాజాగా ప్రభుత్వం జీవోను నిలిపివేయాలని నిర్ణయించడంతో ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tiger Conservation | సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క
జీవో నంబర్ 49ను ప్రభుత్వం రద్దు చేయడంతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి సీతక్క (Minister Seehtakka), ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కలిశారు. జీవోను వెనక్కి తీసుకోవడంపై వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట ఆదివాసీ సంఘాల నాయకులు ఉన్నారు.