అక్షరటుడే, ఇందూరు:Raithu Mela | జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Giriraj Government Degree College) మైదానంలో మూడు రోజులపాటు నిర్వహించిన రైతు మహోత్సవం బుధవారం ముగిసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహించారు.
నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్టాళ్లను సందర్శించారు. అధిక దిగుబడులను అందించే వంగడాలు, మేలు జాతి పాడి పశువులు, సాగు పరికరాలు, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను తిలకించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు వివిధ రకాల పంటల సాగులో పాటించాల్సిన మెలకువలు, సస్యరక్షణ చర్యలు, ఆధునిక వ్యవసాయం, భూసారం పెంపుదల, అధిక దిగుబడులను అందించే వంగడాలు, తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Raithu Mela | స్టాళ్ల సందర్శన
చివరి రోజు బుధవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu)తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతి రెడ్డి రాజిరెడ్డి తదితరులు రైతు మహోత్సవ వేదిక స్టాళ్లను సందర్శించారు.
Raithu Mela | రైతు మేళాతో ఎంతో ప్రయోజనం..
ఈ సందర్భంగా కలెక్టర్(Nizamabad Collector) మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన జిల్లాతో పాటు మిగిలిన నాలుగు జిల్లాల రైతులకు(Farmers) ఎంతో ప్రయోజనం చేకూర్చిందన్నారు. ప్రస్తుత పరిస్థితులు సామాజిక అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం తదితరంశాలపై నిపుణులు, శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుస్సేన్, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.