అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tesla | ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా (Electric car company Tesla) భారత్‌లోకి అడుగు పెట్టనుంది. స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (SpaceX CEO Elon Musk)కు చెందిన ఈ కార్ల తయారీ దిగ్గజం ఈ నెలలోనే తొలి షోరూంను ప్రారంభించనుంది. భారత్‌లో తొలి షోరూం దేశ ఆర్థిక రాజధాని ముంబై(Mumbai)లో జులై 15న టెస్లా ప్రారంభం కానుంది. ముంబై జియో వరల్డ్ వేదికగా కార్యకలాపాలు నిర్వహించనున్న టెస్లా.. ఇప్పటికే తన వై మోడల్ కార్లను చైనాలోని షాంఘై నగరంలో గల తమ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చినట్లు తెలిసింది. డిమాండ్‌ను బట్టి ఢిల్లీలోనూ షోరూం ఏర్పాటు చేయాలని టెస్లా యోచిస్తోంది.
Tesla | తొలగిన అడ్డంకులు ..
చాలా రోజుల నుంచి ఇండియా మార్కెట్(India Market)లోకి అడుగు పెట్టేందుకు మస్క్‌కు చెందిన కార్ల కంపెనీ తీవ్రంగా ప్రయత్నించింది. అయితే, లగ్జరీ కార్లపై దిగుమతి సుంకాలు భారీగా ఉండడంతో వెనుకంజ వేసింది. అయితే, డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అగ్రరాజ్య పర్యటనకు వెళ్లిన సమయంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన వాణిజ్య చర్చలు భారత్‌లో టెస్లా ఎంట్రీకి దోహదం చేశాయి. అనంతర కాలంలో కేంద్ర ప్రభుత్వం కార్ల దిగుమతులపై పన్నులను సరళీకరించింది. అదే సమయంలో ఇండియాలోనే కార్ల తయారీ ప్లాంట్ల స్థాపనకు గడువు పొడిగించింది. దీంతో దేశీయ మార్కెట్‌లోకి టెస్లా ప్రవేశానికి అడ్డంకులు తొలగిపోయాయి.
Tesla | భారత్‌లోకి లగ్జరీ కార్లు….
ఇండియాలో ఎంట్రీకి అడ్డంకులు తొలగిపోవడంతో టెస్లా తన తొలి షోరూం స్థాపన కోసం ముంబైని ఎంచుకుంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని నెలకు రూ.35 లక్షల చొప్పున అద్దెకు తీసుకుంది. లగ్జరీ కార్ల సెగ్మెంట్‌లో ఉన్న టెస్లా కార్ల ధరలు ఇండియాలో ఏ మేరకు ఉంటాయన్న దానిపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.
ఆటోమొబైల్ రంగం(Automobile Sector)లో కొత్త ఒరవడి సృష్టించిన టెస్లా కంపెనీ ఉత్పత్తి చేసే కార్ల ధరలు.. సగటు భారతీయులకు అందనంత స్థాయిలో ఉన్నాయి. అయితే, దిగమతి సుంకాలు తగ్గడం, స్థానికంగానే ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తే మాత్రం మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా రేట్లు దిగివస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన వై మోడల్ కారు ధర పన్నులు, బీమా కలిపితే రూ. 48 లక్షలపైనే ఉండనుంది. ఇది రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశముందని చెబుతున్నారు.