అక్షరటుడే, వెబ్డెస్క్: TDP vs YCP | ఆంధ్రప్రదేశ్ (AP)లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. వైసీపీ (YCP) నాయకులపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుండగా.. ఉనికి చాటుకోవడానికి వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
TDP vs YCP | అసలు ఏం జరిగిందంటే..
గుడివాడ(gudivada) కే కన్వెన్షన్లో వైసీపీ నాయకులు బాబు ష్యూరిటీ- మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇదే సమయంలో సుపారిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (MLA Ramu) ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు టీడీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో వివాదం మొదలైంది. జెడ్పీ చైర్‌పర్సన్ హారిక కారును కూడా టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. వైసీపీ సమావేశానికి వెళ్తుండగా అడ్డుకున్నారు.
TDP vs YCP | భారీగా పోలీసుల మోహరింపు
వైసీపీ నేతలు సమావేశం ముగిసిన తర్వాత కూడా కే కన్వెన్షన్ లనే కూర్చున్నారు. మరోవైపు నాగవరప్పాడు జంక్షన్ దగ్గరే టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. ఇరు వర్గాలు ఎదురుపడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు.
TDP vs YCP | మాజీ మంత్రి హౌస్ అరెస్ట్
గుడివాడలో ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నానిని (Perni Nani) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన గుడివాడ వెళ్తే వివాదం పెద్దది అవుతుందని భావించిన పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇప్పటికే పేర్ని వస్తే అడ్డుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరించారు.
TDP vs YCP | పేర్ని నానిపై కేసు నమోదు
మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పామర్రులో ఆయన మాట్లాడుతూ.. చీకట్లో కన్నుకొడితే పనైపోవాలి.. అంతేగానీ రప్పా రప్పా అనడమేంటి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఇప్పుడు తప్పులు చేసిన వారిని నరికేద్దామన్నారు. రప్పా.. రప్పా అనే పనులు చీకట్లో జరిగి పోవాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పేర్ని నాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేత శ్రీనివాసరావు అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు.