అక్షరటుడే, వెబ్‌డెస్క్: Snakes : పాములను చూస్తే ఎవరైనా గజగజ వణుకుతారు. అవి తమని ఎక్కడ కాటేస్తాయోనని భయపడిపోతారు. అలాంటిది ప్రమాదకర విషం కలిగిన రెండు కట్ల పాములు (venomous snakes) మెడలో వేలాడితే.. అదీనూ రాత్రంగా అలాగే ఉంటే.. ఆ భయానక దృశ్యం ఊహించుకుంటేనే ఒంట్లోంచి వణుకు మొదలవుతుంది. బిహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
Snakes : బాలిక మెడలో.. రెండు పాములు
గయాలోని ఫతేపుర్ పోలీస్ స్టేషన్ పరిధి జామ్హేటాలో రాజు కుమార్ కేసరి కుటుంబం ఉంటోంది. ఆదివారం రాత్రి ఇంట్లో అంతా నిద్రపోయారు. మరునాడు ఉదయం రాజు భార్య నిద్ర నుంచి లేచి చూసేసరికి వారి కూతురు సలోని కుమారి (10) మెడలో రెండు కట్ల పాములు కనిపించాయి. ఒక్కసారి భయకంపితురాలైన ఆమె గట్టిగా అరిచింది. ఆ అరుపులకు రాజు కుమార్ నిద్రలేచాడు. కూతురు మెడలో పాములను చూసి షాకయ్యాడు.
Snakes : రాత్రంతా మెడలోనే…!
కుమార్తె కోసం రాజు తన ప్రాణాలను లెక్కచేయలేదు. వెంటనే పాప మెడలోని పాముల నోళ్లను తన చేతులతో పట్టుకున్నాడు. అలానే గట్టిగా ప్రెస్ చేయడంతో ఆ రెండు పాములు కూడా అక్కడికక్కడే మరణించాయి. ఈ ఘటన గురించి తెలిసి గ్రామస్థులందరూ షాక్ అయ్యారు. పాప మెడలో రాత్రంతా ఆ రెండు పాములు ఉన్నట్లు రాజు చెబుతున్నారు.
పాములను చంపిన తర్వాత రాజు తన పాప సలోనిని ఫతేపుర్ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. తండ్రీ కూతురు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. ఎవరు కూడా విషం బారిన పడలేదు. వైద్యులు ముందు జాగ్రత్త చర్యగా తండ్రీకూతురును పరీక్షల కోసం గయా మగధ్ మెడికల్ కాలేజీకి పంపారు.