అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Spring Airlines | విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందతున్నారు. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి (Ahmedabad Plane Crash) 270 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం దేశంలో పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రయాణికులు విమాన ప్రయాణం అంటేనే ఆలోచిస్తున్నారు. తాజాగా జపాన్ (Japan)లో ఓ విమానం గాలిలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఒక్కసారిగా విమానం 36 వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగింది. దీంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు.
జపాన్‌లోని స్ప్రింగ్ ఎయిర్‌లైన్స్ (Spring Airlines) విమానం జూన్ 30న చైనా(China)లోని షాంఘై నుంచి జపాన్ రాజధాని టోక్యో (Tokyo)కు బయలుదేరింది. అయితే విమానం గాలిలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఫ్లైట్ ఒక్కసారిగా 36 వేల అడుగుల ఎత్తు నుంచి పది వేల అడుగుల ఎత్తుకు పడిపోయింది. ఏం జరుగుతుందో తెలియాక ప్రయాణికులు తీవ్రంగా భయ పడిపోయారు. సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొమని చెప్పారు. ఫైలెట్ చాకచక్యంగా స్పందించి ఏయిర్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందజేశాడు. అనంతరం జపాన్‌లోని ఒసాకో విమానాశ్రయంలో ఫ్లైట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆ సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి 191 మంది ఉన్నారు.