అక్షరటుడే, వెబ్‌డెస్క్: TDP leader : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన తెదేపా నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. ఒంగోలు మినీ బైపాస్‌లోని ఓ అపార్టుమెంట్‌లోని తన కార్యాలయంలో ఉన్న సమయంలో ముసుగు వేసుకొచ్చిన నలుగురు వ్యక్తులు వచ్చి కత్తులతో దాడి చేశారు. కత్తులతో దారుణంగా పొడవడంతో వీరయ్య రక్తపు మడుగులో పడిపోయారు.
వీరయ్య తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో వీరయ్య పార్టీ వ్యవహారాలు చూసుకునేవారు. మద్యం వ్యాపారంలోనూ ఉన్నారు. జిల్లాలోని పలు చోట్ల మద్యం దుకాణాల నిర్వహణలో ఈయన సిండికేట్‌గా వ్యవహరిస్తున్నారనే వాదన ఉంది.
మద్యం సిండికేట్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యవహారాల ఆర్థిక వివాదాలే హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఎస్పీ దామోదర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అపార్టుమెంట్లో ఉన్నవారిని ప్రశ్నించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.