అక్షరటుడే, ఇందూరు: TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ.. ప్రభుత్వ యంత్రాంగం చేపట్టే కార్యక్రమాలకు అన్ని వర్గాలు తోడుగా నిలబడాలని సూచించారు. ప్రతిఒక్కరూ తమకంటూ ఏదో ప్రతిభను కలిగి ఉంటారని, దానిని సమాజ ప్రగతి కోసం వినియోగించాలని తెలిపారు. సామాజిక, సాహితీ, సేవా, క్రీడా తదితర రంగాల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న వారు తమ రంగాల ద్వారా క్షయ వ్యాధి నిర్మూలన కృషి చేయాలన్నారు.
TB Mukt Bharat Abhiyan | మలావత్ పూర్ణ.. సౌమ్య తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు..
టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మలావత్ పూర్ణ (Malavat Purna), గుగులోత్ సౌమ్య (Guguloth Soumya) వ్యవహరించాలని గవర్నర్ కోరారు. కవులు, కళాకారులు, రచయితలు, తమ ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం, రెడ్‌క్రాస్ సొసైటీ (Red Cross Society) సమన్వయంతో పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. చేపడుతున్న కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలన్నారు.
TB Mukt Bharat Abhiyan | లక్షణాలున్న వారికి చికిత్స
క్షయవ్యాధి (Tuberculosis) నిర్మూలన చర్యల్లో భాగంగా హైరిస్క్‌లో ఉన్న వారందరికీ చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. స్క్రీనింగ్, ఎక్స్‌రే చేయిస్తూ.. తెమడ పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు అందజేస్తున్నామన్నారు. విరివిగా ఎక్స్‌రే పరీక్షల నిర్వహణ కోసం అవసరమైన యంత్రాలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక నిధులు సమకూర్చామన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో రోగులకు పోషకాహార కిట్లను అందిస్తున్నామన్నారు. వ్యాధి నిర్మూలన కోసం విశేషంగా చేసిన కృషికి 2022-23 ఏడాదికి గాను జిల్లాకు బంగారు పతకం దక్కిందని గుర్తు చేశారు.

కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు