అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. పైసలు తీసుకోనిదే పనులు చేయడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా.. లంచాలకు అలవాటు పడిన పలువురు ఏ మాత్రం వెరవడం లేదు. కొందరు అధికారులైతే లంచం తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ.. డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ (Deputy State Tax Officer) ఏసీబీ అధికారులకు చిక్కింది.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మాదాపూర్ ఏరియా డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ ఎం సుధ లంచం తీసుకుంటుండగా అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ కంపెనీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ (GST Registrarion) కోసం ఆమె లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం రూ.8 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు ట్యాక్స్ ఆఫీసర్ సుధను పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, ఆమెను అరెస్ట్ చేశారు. నిందితురాలను రిమాండ్కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ACB Trap | పెరిగిన అవగాహన
ప్రస్తుతం ప్రజలకు అవగాహన పెరిగింది. గతంలో అధికారులను చూడగానే చాలా మంది భయపడేవారు. ఒంటరిగా కార్యాలయాలకు వెళ్లడానికి కూడా ఆలోచించేవారు. చోటామోటా నాయకులను తోడు తీసుకొని వెళ్లి తమ పనులు చేయించుకునే వారు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదులపై గతంలో అంతగా అవగాహన ఉండేది కాదు. అయితే ప్రస్తుతం అధికారుల అవినీతిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీంతో అవినీతి అధికారుకు ప్రజలు భయపడడం లేదు. లంచం అడిగిన వారిని ఏసీబీకి పట్టిస్తున్నారు. దీంతో ఈ మధ్య చాలా మంది అధికారులు ఏసీబీకి దొరుకుతున్నారు. అయితే ప్రజల్లో మరింత అవగాహన వచ్చి లంచం అడగాలంటేనే అధికారులు జంకాలని పలువురు పేర్కొంటున్నారు.
ACB Trap | ఫిర్యాదు చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని తెలుపుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.