అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. కొంతమంది విద్యాసంస్థలు ప్రారంభం కాగానే చందాల కోసం పాఠశాలలో నిర్వహణలో ఆటంకం కలిగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
ఈ మధ్య కొందరు కొన్ని విద్యాసంస్థలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దౌర్జన్యంగా పాఠశాలలోకి ప్రవేశించి గొడవలకు పాల్పడుతున్న వారి వివరాలు తమ వద్ద ఉన్నాయన్నారు. అలాంటి వారిని వదిలి పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.