అక్షరటుడే, న్యూఢిల్లీ: Pahalgam terror attack : ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అఖిలపక్ష నేతలకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పహల్గావ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) పై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
“జమ్మూకశ్మీర్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుని, పర్యాటకం వృద్ధి చెందుతున్న తరుణంలో స్థానిక పరిస్థితులను ప్రభావితం చేసే లక్ష్యంతోనే పహల్గావ్ ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఈ ఘటన, అనంతరం తీసుకున్న చర్యలను అఖిలపక్ష నేతలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఉగ్రదాడికి దారితీసిన లోపాలు, అవి పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యల గురించి ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వం వెన్నంటే తాము ఉంటామని అన్ని పార్టీల నేతలు చెప్పారు” అని కిరణ్ రిజిజు వివరించారు.
పార్లమెంట్ సముదాయంలోని భవనంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష నేతల కీలక భేటీ జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు జైశంకర్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజుజు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సహా ముఖ్య నేతలు హాజరయ్యారు.
పహల్గావ్ ఉగ్రదాడిని అందరూ ముక్తకంఠంతో ఖండించినట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. కేంద్రం తీసుకునే ఏ చర్యకైనా పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. కశ్మీర్ లో శాంతియుత పరిస్థితుల కోసం కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.