అక్షరటుడే, వెబ్డెస్క్: Supreme Court | దేశవ్యాప్తంగా వీధికుక్కల(Street Dogs) బెడద ఎక్కువ అయిపోయింది. వీటి మూలంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కుక్కల దాడుల్లో ఎంతో మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఒంటరిగా వెళ్తున్న వారు, చిన్నారులపై కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయి. అయితే కొందరు మాత్రం తాము జంతు ప్రేమికులమని చెప్పుకుంటూ వీధికుక్కలకు రోడ్లపైనే ఆహారం పెడతారు. అలాంటి వారి మూలంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది.
Supreme Court | మీ ఇంట్లో పెడితే ఎవరు వద్దంటారు..
ఓ వ్యక్తి రోడ్డుపై కుక్కలకు ఆహారం పెట్టాడు. దీంతో స్థానికులు ఆయనను అడ్డుకున్నారు. కుక్కలకు రోడ్డుపై ఆహారం పెట్టొద్దన్నారు. దీంతో సదరు వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాను కుక్కలకు ఆహారం పెట్టకుండా స్థానికులు అడ్డుకుంటున్నారని పిటిషన్లో పేర్కొన్నాడు. వాదనల సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఆ కుక్కలను మీ ఇంటికి తీసుకెళ్లి ఆహారం పెట్టండి.. అప్పుడు మిమ్మల్ని ఎవరు వద్దంటారు’ అని న్యాయస్థానం పేర్కొంది.
వీధి కుక్కలకు ఆహారం పెట్టాలనుకునేవారు వీధుల్లో కాకుండా, వారి ఇంట్లోనే ఎందుకు పెట్టకూడదని ధర్మాసనం ప్రశ్నించింది. రోడ్డుపై మనుషులకే స్థలం ఉండడం లేదని.. కుక్కలకు ఆహారం పెడితే ఎలా అని వ్యాఖ్యానించింది. పిటిషనర్ కావాలంటే తన ఇంట్లో కుక్కలకు షెల్టర్ ప్రారంభవచ్చని సూచించింది.
Supreme Court | రోడ్డుపై వెళ్లాలంటే భయం
తెలంగాణ(Telangana)లోని చాలా గ్రామాల్లో కుక్కల బెడద ఉంది. ముఖ్యంగా పట్టణాల్లో వీటి సంఖ్య అధికంగా ఉంది. దీంతో ప్రజలు రోడ్డుపైకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. బైక్పై వెళ్తున్న వారిని సైతం కుక్కలు వదలడం లేదు. వేగంగా వెళ్తున్న బైక్లకు అడ్డురావడమే కాకుండా.. వెంట పడుతున్నాయి. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఈ క్రమంలో కుక్కల బెడదను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం(Government) చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.