అక్షరటుడే, వెబ్‌డెస్క్: Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ లో తాజాగా ఓ వింత వివాహం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయి మెడలో తాళి కట్టడం ఇందుకు కారణం. అనాదిగా రహస్యంగా జరుగుతూ వస్తున్న ఇలాంటి పెళ్లిళ్లను వీరు అందరికీ తెలిసేలా వైభవంగా నిర్వహించుకున్నారు.
ఇలాంటి పెళ్లిళ్లు కొత్తేమి కాదు. కానీ, ఎవరికీ తెలియనీయరు. కానీ, సంస్కృతిని ప్రపంచానికి చాటేలా సిర్మౌర్ జిల్లా (Sirmaur district) ఓ కుటుంబం పెళ్లి వేడుక నిర్వహించింది. షిల్లాయ్ (Shillai) గ్రామంలో నిర్వహించిన ఈ వివాహ వేడుక ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.
ఈ గ్రామంలో ప్రదీప్ నేగి (Pradeep Negi), కపిల్ నేగి (Kapil Negi) అనే అన్నదమ్ములు ఉన్నారు. వీరు సమీపంలోని కున్హత్ (Kunhat) పల్లెకు చెందిన సునీతా చౌహాన్ (Sunita Chauhan)ను పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకను మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
‘హట్టి పాలియాండ్రీ’ (Hatti tradition) అనే తరతరాల ఆచారం ప్రకారం ఈ వివాహాన్ని జరిపారు. ఈ ఆచారంలో ఒక ఇంట్లో ఎంతమంది అన్నదమ్ములు ఉంటే.. అంత మందిని కలిపి ఒకే వధువు పెళ్లి చేసుకుంటుంది.
Himachal Pradesh | అందరూ ఉన్నత చదువరులే..
సాధారణంగా ఇలాంటి పెళ్లిన బయటకు చెప్పుకోరు. సీక్రెట్‌గా కానిచ్చేస్తారు. కానీ, నేగి కుటుంబం డిఫరెంట్. గ్రామస్థుల సహకారంతో ఈ పెళ్లి వేడుకను పండుగలా నిర్వహించింది.
ఇక పెద్ద పెళ్లి కొడుకు ప్రదీప్ జలశక్తి డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. చిన్న వరుడు కపిల్‌కు ఫారెన్‌లో హాస్పిటాలిటీ సెక్టార్‌లో కొలువు. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. కానీ, కలిసే సునీతతో జీవితాన్ని పంచుకుంటున్నారు.
ఇలా ఇద్దరూ ఒక్కరినే వివాహం చేసుకోవడం వల్ల వధువుకు ఆర్థికంగా, అండగా ఎల్లప్పుడూ ఎవరో ఒకరు తోడుంటారని చెబుతున్నారు.
సునీత సైతం ఇద్దరిని పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా సమ్మతించింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంది. ఇలా ముగ్గురూ ఒక అండర్‌స్టాండింగ్‌కు రావడం అందరికీ ముచ్చటేసింది.
Himachal Pradesh | హట్టి పాలియాండ్రీ అంటే..
ఇక్కడి వర్గంలో పెళ్లి విషయంలో అనాదిగా కొనసాగుతున్న ఆచారం. బహుభర్తృత్వాన్ని ‘జోడిదారన్’ (Jodidaran) అంటారు. ‘ద్రౌపది ప్రథ’ అని కూడా పేరుంది. ఐదుగురు పాండవులను ద్రౌపది పెళ్లాడటం మనం మహాభారతంలో చూశాం. అందువల్లే ఈ ఆచారానికి ఆ పేరు వచ్చిందంటారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ట్రాన్స్-గిరి, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది.
Himachal Pradesh | లాభాలు అనేకం..
ఒకటి ఆస్తి పంపకాల సమస్య ఉండదు. తాతల నాటి భూమి ముక్కలు కాదు. ఆస్తి మొత్తం కుటుంబం చేతిలోనే ఉంటుంది. మహిళకు భద్రత ఎక్కవ. భర్తల్లో ఒకరు దూరమైనా, మరొకరు అండగా ఉంటారు. అందరూ ఒకే గూటి కింద ఉంటారు.
Himachal Pradesh | అంగరంగ వైభవంగా…
ఇప్పటి వరకు రహస్యంగా జరిగిన ఇలాంటి పెళ్లి వేడుకలకు భిన్నంగా.. ఈ వివాహం జరిపారు. ఎంతో సంప్రదాయబద్ధంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోకల్ ఫోక్ మ్యూజిక్, పహాడీ నృత్యాలు, స్పెషల్ వంటకాలతో అలరించారు.
గ్రామస్థులంతా పెళ్లి వేడుకకు హాజరై ఈ ముచ్చటైన ముగ్గురి జంటను దీవించారు. ఇటీవలే హట్టి కమ్యూనిటీకి ఎస్టీ హోదా వచ్చింది. దీంతో వారి ఆచారాలు, సంప్రదాయాలు, చరిత్రకు మరింత గుర్తింపు లభిస్తోంది.
Himachal Pradesh | పెళ్లి గురించి ఎవరు ఏమన్నారంటే..
పెద్ద వరుడు ప్రదీప్.. ‘ఇది మేమందరం కలిసి తీసుకున్న నిర్ణయం. ఒకరిపై ఒకరికి సంపూర్ణంగా నమ్మకం ఉంది. మా సంప్రదాయం, ఆచారం పాటించడం గర్వంగా ఉంది’ అన్నారు.
చిన్న వరుడు కపిల్.. ‘నేను విదేశాల్లో ఉంటాను. కానీ, నన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన సునీత ఒంటరి కాదు.. తనకు ఎల్లప్పుడూ ఒక తోడు ఉంటుంది’ అని పేర్కొన్నారు.
వధువు సునీత.. ‘మా బంధం తప్పకుండా బాగుంటుంది. మా ఆచారాన్ని విశ్వసిస్తాను. అందుకే పూర్తి నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నా.. ’ అని సంతోషంగా చెప్పుకొచ్చారు.