అక్షరటుడే, వెబ్‌డెస్క్: Capsule Hotels | భారతీయ రైల్వే ప్రయాణికులకు పెద్దపీట వేస్తోంది. రైళ్లతో పాటు రైల్వే స్టేషన్లను సేవలను విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే స్టేషన్లను ఆధునీకరిస్తున్న రైల్వే శాఖ (Railway Department).. ఇప్పుడు ప్రయాణికులకు లగ్జరీ వసతులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే విశాఖపట్నం రైల్వే స్టేషన్ (Visakhapatnam Railway Station)లో ప్రయాణికుల సౌకర్యార్థం సరికొత్త క్యాప్సూల్ హోటల్స్ ప్రారంభించింది. తూర్పు కోస్తా రైల్వే జోన్‌లోనే తొలిసారి అందుబాటులోకి వచ్చిన ఈ స్లీపింగ్ పాడ్స్‌లో సింగిల్, డబుల్ బెడ్ ఆప్షన్లు ఉన్నాయి. మహిళలకు ప్రత్యేకంగా బెడ్స్ తీసుకొచ్చారు. తక్కువ ధరలోనే ఏసీ వసతి, వైఫై, హాట్ వాటర్ వంటి సౌకర్యాలతో పాటు టీవీ చూసేందుకు సోఫాలు కూడా ఏర్పాటు చేశారు.
Capsule Hotels | స్లీపింగ్ పాడ్స్..
జపాన్‌లో మొదలైన లగ్జరీ తరహా వసతి సౌకర్యాలు ఇప్పుడు మన దగ్గర కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో క్యాప్సూల్ హోటల్స్ (Capsule Hotels) ను ప్రారంభించారు. వీటిని స్లీపింగ్ పాడ్స్ అని కూడా పిలుస్తారు. రైలు పెట్టెలో పడకలు ఉన్నట్టుగా స్లీపింగ్ పాడ్స్‌ను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబరు ప్లాట్‌ఫాంలో ఫస్ట్ ఫ్లోర్‌లో.. ఈ స్లీపింగ్ పాడ్స్ (Sleeping Pods) అందుబాటులోకి తీసుకొచ్చారు. రైలు బోగీలో, స్లీపర్ బస్సుల్లో ఉన్నట్లుగా ఒక వరుసలో పైన, కింద బెర్త్‌లు (క్యాప్సుల్స్) ఉంటాయి. అలాగే ఎదురెదురుగా ఈ క్యాప్సుల్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఈ క్యాప్సుల్‌కు కర్టెన్లు కూడా ఏర్పాటు చేయడంతో ప్రైవసీకి ఇబ్బంది ఉండదు.
Capsule Hotels | అత్యాధునిక వసతులు..
ఈ క్యాప్సూల్స్ హోటల్‌లో అత్యాధునిక వసతులు అందుబాటులో ఉంచారు. ఏసీ(AC)తో పాటు వైఫై, హాట్ వాటర్(Hot Water), టీవీ చూడడానికి సోఫాలు వంటివి ఏర్పాటు ఏర్పాటు చేశారు. మొత్తం 73 సింగిల్ బెడ్ పాడ్స్, 15 డబుల్ బెడ్ పాడ్స్, మహిళల కోసం ప్రత్యేకంగా 18 బెడ్‌లను ఏర్పాటు చేశారు. విశ్రాంతి తీసుకునేవారి కోసం వివిధ రకాల స్నాక్స్ కూడా అందుబాటులో ఉంచారు. స్నానానికి వేడి నీరు సౌకర్యం కూడా ఉంది. ప్రయాణికులకు కావాల్సిన సమాచారం అందించే డెస్క్, ఆధునిక వాష్‌రూమ్(Modern washroom) సౌకర్యం కూడా ఉంది.
Capsule Hotels | తక్కువ ధరకే..
ఇంతటి లగ్జరీ సేవలు(Luxury Services) తక్కువ ధరకే అందుబాటులో ఉండడం గమనార్హం. సింగిల్ బెడ్ అయితే 3 గంటలకు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. అదే 24 గంటలకు అయితే రూ.400 వసూలు చేస్తారు. డబుల్ బెడ్ తీసుకుంటే 3 గంటలకు రూ.300, ఆ తర్వాత 24 గంటలకు రూ.600 చెల్లించాలి. అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన వసతి లభిస్తుండడం ప్రయాణికులను ఆకట్టుకుంటోంది.