అక్షరటుడే, వెబ్‌డెస్క్:Harbhajan Singh | 2008 ఐపీఎల్ తొలి సీజన్ వివాదానికి నిలయంగా మారిన విషయం తెలిసిందే. ముంబయి ఇండియన్స్ తరపున ఆడుతున్న హర్భజన్ సింగ్ .. కేరళ స్పీడ్ స్టార్ శ్రీశాంత్(Sreeshanth)తో గొడవ పడగా, ఆ ఘర్షణ అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం హర్భజన్ శ్రీశాంత్ చెంపపై కొట్టిన ఘటన ఇప్పటికీ క్రికెట్ అభిమానులకి గుర్తుండే సంఘటనగా నిలిచింది. 17 ఏళ్ల తరువాత హర్భజన్(Harbhajan Singh) ఈ అంశాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆర్.అశ్విన్ యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడిన హర్భజన్, ఈ సంఘటనపై పశ్చాత్తాపంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. “నా జీవితంలో ఏదైనా ఒక్క మార్పు చేసుకునే అవకాశం వస్తే… అది శ్రీశాంత్‌తో జరిగిన సంఘటనే. దానిని తొలగించుకుంటా. అది నా తప్పే. అలాంటి తీరు అవసరం లేదు. అలా చేయకూడదు అని అప్పుడే తెలుసుకోవాల్సింది.
Harbhajan Singh | ఆ బాధ ఇప్పటికీ ఉంది..
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పానో నాకే గుర్తు లేదు. 200 సార్లైనా చెప్పి ఉంటాను. కానీ ఆ మచ్చ మాత్రం మనసులో నుంచి మాయంకావడం లేదు అని హర్భజన్ అన్నారు. ఈ సంఘటనను మరవలేకపోతున్నట్టు చెబుతూ, హర్భజన్ తన మనస్సులో ఎంత బాధ ఉందో వెల్లడించారు. శ్రీశాంత్ కుమార్తెను కలిసిన ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ, తను ఎదుర్కొన్న వేదనను షేర్ చేసుకున్నారు. ఆ ఘటన జరిగిన చాలా ఏళ్ల తర్వాత శ్రీశాంత్ కుమార్తెను ఓ కార్యక్రమంలో కలిశాను. ఆమెతో స్నేహపూర్వకంగా మాట్లాడాలని అనుకున్నా. కానీ ఆమె మాత్రం.. ‘నువ్వు మా నాన్నని కొట్టావు.. నేను నిన్ను ఇష్టపడటం లేదు’ అని చెప్పింది. ఆ మాటలు నన్ను ఎంతగానో బాధించాయి.
ఆ సమయంలో నా కళ్లలో నీళ్ళు వచ్చాయి. నేను చేసిన తప్పు మళ్లీ గుర్తుకు వచ్చింది అని భావోద్వేగంగా చెప్పాడు. ఆ చిన్నారి మనసు గెలుచుకోవడానికి నేను ఏం చేయగలను అని నాలో నేను ప్రశ్నించుకున్నాను. నేను తనకి ఎప్పుడు మద్దతుగా ఉంటాను. నాపై ఆమె అభిప్రాయం మారాలి. అలాంటి వ్యక్తిని కాదని, నేను చేసిన తప్పు తెలుసుకున్నాను అని నిరూపించుకోవడానికి ఏమైన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తాను పెద్దయ్యాక కూడా అలాంటి అభిప్రాయంతో ఉండకూడదు అని నేను కోరుకుంటున్నాను. నా జీవితంలో అత్యంత చేదు అనుభవం ఇది. దాన్ని నా కెరీర్ నుంచి పూర్తిగా తీసేయాలని కోరుకుంటున్నానంటూ హర్భజన్ ఎమోషనల్‌గా మాట్లాడాడ. అయితే శ్రీశాంత్ కుమార్తె ఈ మాటలు ఎప్పుడు అన్నది, ఆ సందర్భం ఏంటి అనే వివరాలను మాత్రం హర్భజన్ వెల్లడించలేదు.