అక్షరటుడే, వెబ్‌డెస్క్ :National Herald case | నేషనల్ హెరాల్డ్ కేసులో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ.2 వేల కోట్ల ఆస్తులు కలిగిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను కాంగ్రెస్ స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నదని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) ఆరోపించింది. బుధవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ సందర్భంగా ఈడీ కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ నాయకులు సోనియా(Sonia), రాహుల్ గాంధీ(Rahul Gandhi)ల ఆదేశం మేరకు ఈ కుట్ర జరిగిందని ఈడీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ V రాజు వెల్లడించారు. సోనియా, రాహుల్ 76% వాటాలను కలిగి ఉన్న యంగ్ ఇండియన్ ఏర్పాటు వెనుక కుట్ర జరిగిందని ఆరోపించారు. దీనిలో కాంగ్రెస్ నుంచి తీసుకున్న రూ.90 కోట్ల రుణం కోసం రూ.2 వేల కోట్ల ఆస్తులను స్వాధీనపరచుకున్నారన్నారు.. కాంగ్రెస్ అగ్ర నాయకుల సూచనల మేరకు ఏజేఎల్‌కు ప్రకటనల నిధులు మళ్లించారని తెలిపారు.
National Herald case | నకిలీ లావాదేవీలు..
సోనియా, రాహుల్ గాంధీలకు సంబంధమున్న ఏజేఎల్‌తో పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నకిలీ లావాదేవీలు జరిపారని ఈడీ తరఫు న్యాయవాది ఆరోపించారు. చాలా ఏళ్లుగా వీరు మోసపూరితంగా ఇలా అద్దె చెల్లించారన్నారు. అందుకు సంబంధించిన రశీదులను వీరు తయారు చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సూచనల మేరకే ఈ నగదును వీరు ఇలా ఏజేఎల్‌కు బదిలీ చేశారని కోర్టుకు విన్నవించారు. అలాగే, ప్రకటనల నిధులు సైతం దారి మళ్లించారని వివరించారు. ఇటువంటి మోసపూరిత మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం నేరమని ఈడీ(ED) పేర్కొంది. ఇక ఈ కేసులో దాతలను సైతం ఈడీ ఇప్పటికే ప్రశ్నించిందని గుర్తు చేశారు. అలాగే సీనియర్ నేతలను సైతం విచారించిందని చెప్పారు.
National Herald case | షేర్ల బదిలీలపై విచారణ అవసరం..
షేర్ల బదిలీపై ప్రశ్నించాల్సి ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది.. సుమన్ దుబే షేర్లను సోనియాగాంధీకి, ఆస్కార్ ఫెర్నాండేజ్ షేర్లను రాహుల్ గాంధీకి బదిలీ చేశారన్నారు. కానీ ఆ తర్వాత ఈ షేర్లను ఆస్కార్ ఫెర్నాండెజ్‌కు తిరిగి బదిలీ చేశారని వివరించారు. ఇవన్నీ నకిలీ లావాదేవీలని పేర్కొన్నారు. అయితే 2015 వరకు ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందారని.. వారిద్దరు సోనియా, రాహుల్ గాంధీలు మాత్రమేనని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
రాహుల్, సోనియా గాంధీ నేరం ద్వారా వచ్చిన ఆదాయంలో దాదాపు రూ.142 కోట్లు అనుభవించారని గత విచారణ సందర్భంగా ఈడీ కోర్టుకు తెలిపింది. నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald case)లో గాంధీ కుటుంబంతో సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులపై మనీలాండరింగ్ నిరోధక సంస్థ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసింది. ఛార్జ్ షీట్లో పేరున్న ఇతరులలో కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ పిట్రోడా, సుమన్ దూబే ఇతరులు ఉన్నారు.