అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్‌లోని ఓ పాడుబడ్డ ఇంట్లో అస్థి పంజరం ఉండడం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో (Social Media) ఫేమస్ కావడానికి ఇటీవల కొందరు రకరకాల వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఓ యువకుడు మీకు ఒకటి చూపిస్తానంటూ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లి వీడియో తీశాడు. అస్థిపంజరం చూపిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు.
హైదరాబాద్‌లోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ (Habibnagar Police Station) పరిధిలోని నాంపల్లిలోని ఓ ఇంట్లో అస్థి పంజరం బయట పడింది. నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ పాడుబడ్డ ఇంట్లో దానిని చూసిన యువకుడు సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. దీంతో పోలీసులు సదరు యువకుడిని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. దాదాపు ఏడేళ్లుగా ఆ ఇంట్లో ఎవరూ లేరని, ఇంటి ఓనర్ విదేశాలలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అయితే ఆ అస్థిపంజరం ఎవరిది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఇల్లు పాడుబడి ఉండడంతో హత్య చేసి పాతిపెట్టి ఉంటారని తెలుస్తోంది.