అక్షరటుడే, వెబ్‌డెస్క్: Encounter | మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఆపరేషన్ కగార్ (Operation Kagar)లో భాగంగా చోటు చేసుకుంటున్న వరుస ఎన్కౌంటర్లతో భారీగా మావోయిస్టులు మృతి చెందుతున్నారు. తాజాగా బుధవారం ఉదయం జార్ఖండ్ (Jharkhand)లోని బొకారో జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
భద్రత బలగాలు మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ (Search Operation) చేపట్టాయి. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకోగా.. సబ్-జోనల్ నక్సల్ కమాండర్ కున్వర్ మాంఝీ అలియాస్ సహ్‌దియో మాంఝీ అలియాస్ సాడే మృతి చెందారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ 209 కోబ్రా యూనిట్, జార్ఖండ్ పోలీసులు (Jharkhand Police) ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఘటన స్థలంలో బలగాలు ఒక ఏకే 47, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నాయి.
Encounter | వరుస ఎన్కౌంటర్లు
దేశంలో 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రకటించారు. ఈ వర్షాకాలంలో సైతం మావోలకు నిద్ర లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగరాను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారం వస్తే చాలా కూంబింగ్ (Coombing) నిర్వహిస్తున్నాయి.
ఈ క్రమంలో వరుస ఎన్కౌంటర్లు (Encounter) చోటు చేసుకుంటుండగా.. భారీ సంఖ్యలో మావోలు కేడర్‌ను కోల్పోతున్నారు. మరోవైపు కీలక నేతలు సైతం హతం అవుతుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆపరేషన్ కగార్ ఆపాలని, తాము శాంతి చర్చలకు సిద్ధమని వారు ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం (Central Government) మాత్రం చర్చలు లేవని స్పష్టం చేసింది. ఆయుధాలు వీడి లొంగిపోవడం ఒక్కటే మావోలకు ఉన్న మార్గమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నారు.