అక్షరటుడే, వెబ్‌డెస్క్:Shivasena MLA | పప్పు బాలేదని రెచ్చిపోయిన ఓ ఎమ్మెల్యే దాష్టీకానికి దిగారు. క్యాంటీన్ నిర్వాహకుడి చెంప చెల్లుమనిపించారు. మహారాష్ట్ర రాజధాని ముంబై(Mumbai)లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర(Maharashtra)లో మరాఠీ వివాదం కొనసాగుతోన్న తరుణంలో శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఈ విధంగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. పైగా తన చర్యను ఆయన సమర్థించుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Shivasena MLA | రెచ్చిపోయిన ఎమ్మెల్యే..
బుల్దానాకు చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్(Shiva Sena MLA Sanjay Gaikwad) ఆకాశవాణి ఎమ్మెల్యే రెసిడెన్స్‌లో ఉంటున్నారు. అక్కడి క్యాంటీన్‌లో భోజనం చేసేందుకు వెళ్లిన ఆయన.. పప్పు, చపాతీ తేవాలని క్యాంటీన్ సిబ్బందికి చెప్పారు. అయితే, అయితే పప్పు నుంచి దుర్వాసన రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన క్యాంటీన్‌లోకి చొరబడ్డారు. ఈ పప్పు ఎవరు వండారు అంటూ అక్కడి స్టాఫ్‌ను నిలదీశారు.
చేతిలో పప్పు ప్యాకెట్ పట్టుకున్న ఎమ్మెల్యే.. దీని వాసన చూడాలంటూ క్యాంటీన్ స్టాఫ్(Canteen Staff)పై సీరియస్ అయ్యారు. కొంత తినేసరికి కడుపు నొప్పి మొదలైందని, వికారంగా ఉందన్నారు. దీన్ని వండింది ఎవరు? ఒక ఎమ్మెల్యేకు ఇలాగే వడ్డిస్తారా? నాకే ఇలాంటి వంట పెడితే మిగతావారి పరిస్థితి ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో క్యాంటీన్ నిర్వాహకుడు అక్కడకు రాగా, ఎమ్మెల్యే కోపంతో అతడిపై దాడికి దిగారు. చెంప చెల్లుమనిపించిన సంజయ్ గైక్వాడ్.. ముఖం మీద దాడి చేయడంతో క్యాంటీన్ నిర్వాహకుడు కింద పడిపోయాడు.
Shivasena MLA | ఇది శివసేన స్టైల్ అట..
క్యాంటీన్ ఆపరేటర్(Canteen Operator)తో పాటు ఇతర స్టాఫ్ మీద కూడా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ దాడికి దిగారు. పైగా ఈ ఘటనను ఆయన సమర్థించుకున్నారు. ఆహారం అస్సలు బాలేదని, క్యాంటీన్ నిర్వాహకులు వేలాది మంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన దాంట్లో తప్పేమీ లేదని.. ఇందులో విచారించాల్సిన అవసరం లేదన్నారు. ఇదే శివసేన స్టైల్ అని స్పష్టం చేశారు. గతంలోనూ గైక్వాడ్ ఇలాగే వార్తల్లో నిలిచారు. రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi) డిమాండ్ చేసిన నేపథ్యంలో.. ఆయన నాలుకను కత్తిరించే వారికి రూ.11 లక్షల నజరానా ఇస్తానని గైక్వాడ్ ప్రకటించి విమర్శల్లో చిక్కుకున్నారు.