అక్షరటుడే, కామారెడ్డి: Operation Tiger | కామారెడ్డి జిల్లాలో పెద్దపులి జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తండా, మాచారెడ్డి (Machareddy) మండలం ఎల్లంపేట అటవీ ప్రాంత (Yellampeta Forest Area) పరిధిలో అటవీశాఖ అధికారులు జల్లెడ పడుతున్నారు. మూడవ రోజైన మంగళవారం కూడా అధికారుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. అయినా పెద్దపులి జాడ కనిపించలేదు. ఉమ్మడి జిల్లాకు చెందిన మూడు బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి.
Operation Tiger | ఆరు ట్రాక్ కెమెరాలతో సెర్చ్ ఆపరేషన్..
ఇప్పటికే అడవిలో పులి ఆచూకీ కనుక్కునేందుకు 6 ట్రాక్ కెమెరాలు(Track cameras) ఏర్పాటు చేశారు. వీటితో పాటు రెండు డ్రోన్ల ద్వారా కూడా అడవి మొత్తం గాలించారు. అయినా పెద్దపులి ఆచూకీ లభించలేదు. మరోవైపు పులిపై విషప్రయోగం జరిగిందనే ప్రచారం అధికారులను వేధిస్తోంది.
Operation Tiger | జిల్లా పరిధిలోనే ఉందా..?
జిల్లా పరిధిలోనే పెద్దపులి ఉందా..? ఉంటే ఎక్కడ ఉంది..? శివారు దాటితే ఏ వైపు వెళ్లి ఉంటుంది..? విషప్రయోగం జరిగింది నిజం అయితే పులి బతికే ఉందా..? చనిపోయిందా..? అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. మూడు రోజుల నుంచి నిరంతరంగా అధికారులు అడవిని జల్లెడ పడుతున్నారు. బుధవారం కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.
Operation Tiger | విషప్రయోగం చేసిన నలుగురికి రిమాండ్
మరోవైపు స్కూల్ తండాకు చెందిన మహిపాల్ అనే యువకుడికి చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసింది. పులి వచ్చిన సమయంలో మహిపాల్ తన ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీశాడన్న ప్రచారం సాగింది. పులి సంచారం చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మహిపాల్ ఆవుపై పులి దాడి చేయడంతో ఆవు చనిపోయింది.
Operation Tiger | పులి మళ్లీ వస్తుందనే ఉద్దేశంతో..
దాంతో పులి మళ్లీ వచ్చి ఆవును తింటుందని, వస్తే పులి చనిపోయేలా ఆవుపై గడ్డి మందు చల్లినట్టుగా గుర్తించిన అధికారులు మహిపాల్‌తో పాటు అతనికి సహకరించిన గోపాల్, సంజీవులును అధికారులు రెండు రోజుల పాటు విచారించారు. అధికారుల విచారణలో గడ్డి మందు చల్లింది నిజమేనని మహిపాల్ ఒప్పుకున్నట్టు అధికారులు సైతం వెల్లడించారు. సోమవారం రాత్రి మరోసారి అధికారులు విచారణ చేపట్టగా తమ ముగ్గురితో పాటు తండాకు చెందిన కన్నీరాం అనే వ్యక్తి కూడా ఉన్నట్టుగా చెప్పడంతో అతన్ని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నలుగురిని జిల్లా కోర్టులో హాజరు పరచగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.