అక్షరటుడే, వెబ్‌డెస్క్: Saina Nehwal | భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్(Saina Nehwal), తన భర్త పారుపల్లి కశ్యప్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కశ్యప్‌తో దాదాపు 20 ఏళ్ల ప్రేమ, ఏడేళ్ల వివాహ బంధాన్ని ఆమె తెంచుకుంటున్నారు. నెహ్వాల్, కశ్యప్ ఇద్దరూ బ్యాడ్మింటన్‌లో రాణించారు. నెహ్వాల్ ఒలింపిక్ కాంస్య పతకం, ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ ద్వారా సత్తా చాటగా, పారుపల్లి కశ్యప్(Parupalli Kashyap) కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచి భారత పతకాన్ని రెపరెపలాడించాడు. సుదీర్ఘ కాలంగా కలిసి ప్రయాణం సాగించిన ఈ జంట ఇప్పుడు విడిపోతుండడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సైనా మాత్రమే విడాకులపై ప్రకటన చేయగా, కశ్యప్ నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
Saina Nehwal | విడిపోతున్నట్లు ప్రకటన.
35 ఏళ్ల బ్యాడ్మింటన్ స్టార్ అయిన సైనా.. విడాకుల(Divorce) నిర్ణయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఈ మేరకు తన అభిమానులతో ఒక సంక్షిప్త ప్రకటనను పంచుకున్నారు. “జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశల్లోకి తీసుకెళుతుంది. చాలా ఆలోచన, సుదీర్ఘ మధనం తర్వాత, కశ్యప్ పారుపల్లి, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మనం మన కోసం, ఒకరికొకరు శాంతి, వృద్ధి, స్వస్థతను ఎంచుకుంటున్నాము. నీతో గడిపిన ఈ జ్ఞాపకాలకు నేను కృతజ్ఞురాలిని. జీవితంలో ఉత్తమంగా ముందుకు సాగాలని మాత్రమే కోరుకుంటున్నాను. ఈ సమయంలో మా గోప్యతను అర్థం చేసుకుని గౌరవించినందుకు ధన్యవాదాలు” అని సైనా నెహ్వాల్ తన పోస్టులో పేర్కొన్నారు.
Saina Nehwal | సుదీర్ఘ బంధం..
పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ మధ్య సుదీర్ఘ బంధం ఉంది. చిన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమకు దారి తీసింది. 1997లో ఓ అకాడమీలో వీరికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ఒకే దగ్గర కోచింగ్ తీసుకోవడంతో సాన్నిహత్యం పెరిగింది. దశాబ్ద కాలంగా రిలేషన్‌లో ఉన్న వీరు 2018లో వివాహం చేసుకున్నారు. దాదాపు ఏడేళ్ల పాటు ఇద్దరూ కలిసే ముందుకు సాగారు. ఏం జరిగిందో ఏమో కానీ, తాజాగా విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు.
Saina Nehwal | జంట ప్రయాణం..
సైనా, కశ్యప్ ఎప్పుడూ జంటగానే కనిపించే వారు. రిటైర్ అయిన తర్వాత కోచ్‌గా మారిన కశ్యప్ సైనా వెన్నంటి ఉండేవాడు. ఆమె కెరీర్‌ను ఉజ్వలంగా మార్చడంలో అతని పాత్ర ఎంతో ఉంది. 2019 జాతీయ ఛాంపియన్‌షిప్ (National Championship)లలో నెహ్వాల్ పీవీ సింధును ఓడించి సంచలనం సృష్టించింది. ఆ సమయంలో కశ్యపే ఆమెకు గురువుగా ఉన్నారు. ఏ పోటీల్లో సైనా పాల్గొన్నా కశ్యప్ వెంట ఉండే వాడు. ఆమెకు కోర్టు నుంచి సలహాలతో పాటు మార్గదర్శకత్వం చేసే వాడు. అయితే, 2016 నుంచి వరుస గాయాలతో సైనా బాధపడుతున్నప్పటికీ ఆమె వెన్నంటి ఉండి ప్రోత్సహించాడు. నెహ్వాల్ చివరిసారిగా జూన్ 2023లో ప్రొఫెషనల్ పోటీల్లో తలపడింది. ఆ తర్వాత నుంచి ఆటకు దూరమైంది.