అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Stock Market | అమెరికా, భారత్(US -Bharath) మధ్య కుదిరిన మినీ ట్రేడ్ డీల్‌ను ఈరోజు రాత్రి ప్రకటించే అవకాశాలు ఉండడం, యూఎస్ వివిధ దేశాలపై విధించిన అదనపు సుంకాలు భారత ఎగుమతులకు మేలు చేస్తాయన్న అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) చివరలో కోలుకుని పరుగులు తీశాయి. చివరికి లాభాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్(Sensex) 55 పాయింట్లు, నిఫ్టీ 34 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభమైనప్పటినుంచి మధ్యాహ్నం 2.50 గంటల వరకు రేంజ్ బౌండ్‌లోనే ఉన్నాయి. సెన్సెక్స్ 83,320 నుంచి 83,561 పాయింట్ల మధ్య, నిఫ్టీ(Nifty) 23,424 నుంచి 23,495 పాయింట్ల మధ్య కదలాడాయి. యూఎస్, భారత్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్‌ను ఈరోజు రాత్రి ప్రకటించే అవకాశాలు ఉండడాన్ని మార్కెట్ సానుకూలంగా తీసుకుంది. దీంతో ఒక్కసారిగా సెన్సెక్స్ 220 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్ల వరకు పెరిగాయి. చివరికి సెన్సెక్స్ 270 పాయింట్ల లాభంతో 83,712 వద్ద, నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో 25,522 వద్ద ముగిశాయి.
సౌత్ కొరియా, జపాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలనుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా అదనపు సుంకాలను విధించింది. దీంతో ఆయా దేశాలనుంచి ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు తగ్గే అవకాశాలున్నాయి. మరోవైపు మన దేశంతో మినీ ట్రేడ్ డీల్(Mini trade deal) కుదిరిన నేపథ్యంలో ట్రంప్ అదనపు సుంకాలను విధించలేదు. ఇది మన దేశంనుంచి యూఎస్‌కు ఎగుమతి(Export) చేసే కంపెనీలకు మేలు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో Trading సెషన్ ముగిసే సమయంలో మార్కెట్లు లాభాల బాటపట్టాయి.
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,948 కంపెనీలు లాభపడగా 2,081 స్టాక్స్ నష్టపోయాయి. 138 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 128 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 51 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 6 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | మిశ్రమంగా సూచీలు
కన్జూమర్ డ్యూరెబుల్(Consumer durables), ఫార్మా సెక్టార్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనగా.. రియాలిటీ, ప్రైవేట్ బ్యాంక్స్ అవుట్ పర్ఫార్మ్ చేశాయి. బీఎస్‌ఈలో రియాలిటీ ఇండెక్స్ 1.08 శాతం పెరగ్గా.. బ్యాంకెక్స్(Bankex) 0.72 శాతం, పవర్ 0.70 శాతం, యుటిలిటీ 0.68 శాతం, ఇన్‌ఫ్రా 0.59 శాతం, పీఎస్‌యూ 0.52 శాతం పెరిగాయి. కన్జూమర్ డ్యూరెబుల్ సూచీ అత్యధికంగా 1.68 శాతం నష్టపోయింది. హెల్త్‌కేర్(Healthcare) సూచీ 0.81 శాతం, టెలికాం 0.47 శాతం, ఆటో ఇండెక్స్ 0.37 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 0.36 శాతం నష్టపోయాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం, మిడ్ క్యాప్ 0.01 శాతం పెరగ్గా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం పడిపోయింది.
Top gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 18 కంపెనీలు లాభాలతో 12 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. కొటక్ బ్యాంక్ 3.61 శాతం, ఎటర్నల్ 1.89 శాతం, ఆసియా పెయింట్ 1.69 శాతం, ఎన్టీపీసీ 1.64 శాతం, బీఈఎల్ 1.20 శాతం లాభాలతో ముగిశాయి.
Top losers:టైటాన్ 6.17 శాతం, ట్రెంట్ 1.12 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.85 శాతం, మారుతి 0.81 శాతం, హెచ్‌యూఎల్ 0.72 శాతం నష్టపోయాయి.