అక్షరటుడే, వెబ్‌డెస్క్ :RCB | ఇన్నాళ్లుగా అందని ద్రాక్షలా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ(IPL Trophy)ని ఎట్టకేలకు ఆర్సీబీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టును చిత్తుచేసి తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది ఆర్సీబీ(RCB) జట్టు. ఇక తాజాగా ఈ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 సీజన్ ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా, అత్యంత విలువైన ఫ్రాంచైజీగా మొదటి స్థానం దక్కించుకుంది. కొన్నేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ (ఎంఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వంటి జట్లను వెనక్కి నెట్టి మరీ ఆర్సీబీ ఈ ఘనత సాధించడం విశేషం.
RCB | ఆర్సీబీ హవా..
ఇది రాయల్స్ ఛాలెంజర్స్ (Royals Challengers Banglore) అందుకున్న మరో అరుదైన ఘనత. 2025లో విజేతగా నిలిచిన RCB, ఇప్పుడు IPLలో అత్యధిక విలువ కలిగిన ఫ్రాంచైజీగా రికార్డు సృష్టించడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. మార్కెట్ పరిశోధన సంస్థ లెక్కల ప్రకారం, RCB బ్రాండ్ విలువ ప్రస్తుతం $269 మిలియన్లు (రూ.2,256 కోట్లు)గా ఉంది. ఇది గతేడాదితో పోలిస్తే 18.5% పెరిగింది. అత్యధిక విలువ కలిగిన జట్ల జాబితాలో ముంబై ఇండియన్స్ $242 మిలియన్లతో రెండో స్థానంలో ఉంది. గత ఏడాదితో పోల్చితే ఇది 18.6% వృద్ధి చెందింది. ముంబై ఫ్యాన్ బేస్, ప్రదర్శనలు ఈ స్థాయికి కారణమయ్యాయి.
ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇప్పుడు $235 మిలియన్లతో మూడో స్థానానికి పడిపోయింది. అత్యల్పంగా – కేవలం 1.7% పెరుగుదల మాత్రమే నమోదైంది. ఇది అభిమానులను కాస్త నిరాశకు గురి చేసింది. ఇతర జట్ల బ్రాండ్ విలువ (USD మిలియన్లలో) చూస్తే.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): $227, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): $154, ఢిల్లీ క్యాపిటల్స్ (DC): $152, రాజస్థాన్ రాయల్స్ (RR): $146, గుజరాత్ టైటాన్స్ (GT): $142, పంజాబ్ కింగ్స్ (PBKS): $141, లక్నో సూపర్ జెయింట్స్ (LSG): $122గా ఉంది. ఐపీఎల్ 2025లో టైటిల్ గెలవకపోయినా, పంజాబ్ కింగ్స్ జట్టు తమ బ్రాండ్ వాల్యూ (39.6%) ని మరింత పెంచుకుంది. ఇది అన్ని జట్ల కంటే అత్యధికం. ఈసారి IPL టోర్నీ మొత్తం బ్రాండ్ వాల్యూ 13.8% పెరిగి $3.9 బిలియన్లకు (భారత కరెన్సీలో సుమారుగా రూ.32,721 కోట్లు) చేరుకుంది. ఈ లీగ్‌కు గ్లోబల్ ఆదరణ, డిజిటల్ వ్యూయర్‌షిప్, స్పాన్సర్‌షిప్ డీల్స్ ఈ గణాంకాలు సాధించేందుకు కారణమయ్యాయి.