అక్షరటుడే, వెబ్‌డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్(Hyderabad) మల్నాడు డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఈ వ్యవహారంలో పోలీసు అధికారుల పిల్లల పాత్ర వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఇప్పటికే ఓ పోలీసు అధికారి కుమారుడ్ని అరెస్టు చేయగా.. తాజాగా మరో పోలీసు అధికారి వారసుడ్ని అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurent)లో ఇటీవల డ్రగ్స్ పార్టీ జరిగినట్లు గుర్తించిన ఈగిల్ టీం.. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే కీలక ఆధారాలు సేకరించింది. ప్రధానంగా ఈ డ్రగ్ పార్టీ వెనుక పోలీసు అధికారుల పిల్లల పాత్ర ఉన్నట్లు తేల్చి వారిని అరెస్టు చేసింది.
Malnadu Drugs Case | మరో యువకుడి అరెస్టు..
మల్నాడు రెస్టారెంట్‌లోని డ్రగ్స్ పార్టీ(Drugs Party) కేసులో దూకుడు పెంచిన ఈగిల్ టీం నిందితులను వరుసగా అరెస్టు చేస్తోంది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఇంటలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజాను ఈగిల్ టీం(Eagle Team) ఇప్పటికే అరెస్టు చేసింది. అతడ్ని విచారిస్తున్న సమయంలో మరింత సమాచారం లభ్యం కావడంతో మరొకరిని తాజాగా అరెస్టు చేసింది. సైబరాబాద్ ఏఆర్ డీసీపీ (Cyberabad AR DCP) కుమారుడు మోహన్‌ను ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రస్తుతం మోహన్, రాహుల్ తేజా, హర్ష, మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతో పాటు పలువురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
Malnadu Drugs Case | వరుస అరెస్టులు..
మల్నాడు డ్రగ్స్ కేసులో ఇంటెలిజెన్స్ ఏఎస్‌పీ వేణుగోపాల్ కుమారుడి పాత్ర ఉన్నట్లు గుర్తించిన ఈగల్ టీం అతడిని అరెస్ట్ చేసింది. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య(Malnadu Restaurant Owner Surya)తో కలిసి రాహుల్ డ్రగ్స్ బిజినెస్ చేసినట్లు విచారణలో బయటపడింది. నిజామాబాద్‌లో గత నెలలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో రాహుల్ సూత్రధారిగా ఉన్నాడు.
ఆ కేసులో రాహుల్ ఏ3గా ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అతడిని అరెస్ట్ చేయకుండా.. కేవలం ఎఫ్‌ఐఆర్‌లో మాత్రమే రాహుల్ పేరును చేర్చారు. ఈ విషయం తెలిసిన ఈగల్ టీం అధికారులు ఆశ్చర్యపోయారు. పోలీసు అధికారి కుమారుడు అయినందుకే అతడిపై చర్యలు చేపట్టలేదని గుర్తించారు. అయితే, ఇదే సమయంలో మల్నాడు డ్రగ్స్ కేసులో రాహుల్ తేజ పేరు బయటకొచ్చింది. అతడు సూర్య , హర్షతో కలిసి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. మల్నాడు డ్రగ్స్ కేసులో పోలీసు అధికారుల కుమారుల పాత్ర వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
Malnadu Drugs Case | సీరియస్‌గా విచారణ..
డ్రగ్స్ కట్టడిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి నిషేధిత మత్తు పదార్థాల నియంత్రణ కోసం అధికారులకు స్వేచ్ఛ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఏర్పాటైన ఈగిల్ టీం డ్రగ్స్ వ్యాపారం(Drug Dealing)పై దృష్టి సారించింది. మల్నాడు డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడంతో ఈగల్ టీం తనదైన శైలిలో విచారణ చేపట్టి, పలువురిని అరెస్టు చేసింది. ఈ కేసులో సూర్యతో పాటు అరెస్ట్ అయిన ఆరుగురు నిందితులను ఈగల్ టీం అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండురోజులుగా చేపట్టిన ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే పోలీసు అధికారుల వారసుల పాత్ర బయటకు రాగా, పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.