అక్షరటుడే, వెబ్‌డెస్క్: Social Media Accounts | అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ (International news agency Reuters) సోషల్ మీడియా ఖాతాను మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘X’ బ్లాక్ చేసింది. అయితే, కేంద్ర ప్రభుత్వమే బ్లాక్ చేయించిందన్న ఆరోపణలు రావడంతో.. ఈ వివాదంపై ప్రభుత్వం స్పందించింది. రాయిటర్స్ హ్యాండిల్‌ను బ్లాక్ చేయమని ‘X’కి ఎటువంటి చట్టపరమైన అభ్యర్థనను జారీ చేయలేదని కేంద్రం ఆదివారం స్పష్టం చేసింది.
“చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా” రాయిటర్స్ ‘X’ హ్యాండిల్ బ్లాక్ చేసినట్లు పేర్కొంటూ ఒక సందేశాన్ని ప్రదర్శించిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం స్పందించింది. “రాయిటర్స్ హ్యాండిల్‌ను నిలిపివేయాల్సిన అవసరం భారత ప్రభుత్వానికి (Government of India) లేదు. సమస్యను పరిష్కరించడానికి మేము ‘X’తో నిరంతరం పని చేస్తున్నాము” అని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (Ministry of Electronics and Information Technology) అధికారిక ప్రతినిధి వెల్లడించారు.
Social Media Accounts | వివరణ కోరిన ప్రభుత్వం..
రాయిటర్స్ హ్యాండిల్ బ్లాక్ చేసిన ఉదంతంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ‘X’ నిర్వాహకులను ఆదేశించింది. ఖాతాను బ్లాక్ చేయమని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, అయినా ఇచ్చినట్లు పేర్కొనడంపై వివరణ ఇవ్వాలని కోరింది. అదే సమయంలో రాయిటర్స్ హ్యాండిల్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని సూచించింది.
“ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) సమయంలో మే 7న ఒక ఉత్తర్వు జారీ చేశాం. కానీ అది అమలు కాలేదు. ‘X’ ఇప్పుడు ఆ ఉత్తర్వును అమలు చేసినట్లు కనిపిస్తోంది, ఇది వారి వైపు నుంచి తప్పు. ప్రభుత్వం దానిని త్వరగా పరిష్కరించడానికి ‘X’ని సంప్రదించింది” అని అధికారిక వర్గాలు తెలిపాయి.