అక్షరటుడే, వెబ్‌డెస్క్: Srisailam Project | తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సరైన నిర్వహణ లేకపోవడంతో జలాశయాలకు ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల జూరాల ప్రాజెక్ట్(Jurala Project) వరద గేట్లు రోప్‌లు తెగిపోగా.. తాజాగా శ్రీశైలం జలాశయం నుంచి వాటర్ లీక్ అవుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది పరుగులు పెడుతోంది. గద్వాల జిల్లాలో కృష్ణా నదిపై గల జూరాల ప్రాజెక్ట్‌కు భారీ వరద (Heavy flood) వస్తోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు వరద గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు. అయితే ప్రాజెక్టు పలు వరద గేట్ల రోప్‌లు ఇటీవల తెగిపోయాయి. మరికొన్ని గేట్ల రోప్‌లు బలహీనంగా ఉన్నాయి. ఇటీవలే గేట్లకు మరమ్మతులు చేసినా.. రోప్‌లు తెగిపోవడం గమనార్హం. దీంతో ఆ గేట్లను ఎత్తే అవకాశం లేదు. ప్రాజెక్టుకు భారీ వరద వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు, ఆయకట్టు రైతులు ఆందోళన చెందున్నారు.
Srisailam Project | శ్రీశైలంలో..
జూరాల నుంచి వచ్చిన నీరు శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) చేరుకుంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 67వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 873.90 అడుగుల మేర నీరు ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా 172 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండడంతో రెండు మూడు రోజుల్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అయితే జలాశయం 10వ నెంబర్ గేట్‌కు భారీగా లీకేజీ అవుతోంది. గేటు నీరు లీక్ అవుతుండడంతో ఆందోళన నెలకొంది. గత నెలలోనే డ్యామ్ గేట్ల లీకేజీల రబ్బరు సీల్స్‌ను అధికారులు మార్చారు. అయినా మళ్లీ లీకేజీలు ఏర్పడడం గమనార్హం. దీంతో ఆయకట్టు రైతులు(Farmers) ఆందోళన చెందుతున్నారు.
Srisailam Project | పర్యవేక్షణ లేకపోవడంతో..
ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వాహణ, మరమ్మతుల కోసం వేసవిలోనే నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో జూరాల, శ్రీశైలంలో మరమ్మతులు చేశారు. అయినా జూరాల ప్రాజెక్ట్ వరద గేట్ల రోప్‌లు తెగిపోయాయి. మరోవైపు శ్రీశైలం జలాశయం గేటు నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలా జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. నామమాత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.