అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cyber Fraud | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలకు ఆశ చూపి, భయపెట్టి ప్రజల ఖాతాలను లూటీ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ పోలీసులు సైబర్ నేరగాళ్ల ఆట కట్టిస్తున్నారు. ఆధునిక సాంకేతికను వినియోగించుకొని నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. జూన్ నెలలో హైదరబాద్ పోలీసులు(Hyderabad Police) దేశవ్యాప్తంగా 25 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు.
Cyber Fraud | 453 కేసుల్లో నిందితులు
హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్(Special Operation) చేపట్టి వివిధ రాష్ట్రాల్లోని 25 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వీరిపై దేశవ్యాప్తంగా 453 కేసులు ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలో 66 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిందితుల్లో ఏపీ, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక చెందిన వారు ఉన్నారు. వారి నుంచి పోలీసులు రూ.లక్ష నగదు, 20 చెక్ బుక్‌లు, 17 డెబిట్ కార్డులు, 34 ఫోన్లు, 8 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
Cyber Fraud | బాధితులకు రూ.72.85 లక్షలు రిఫండ్
తెలంగాణ పోలీసులు(Telangana Police) జూన్ నెలలో నమోదైన సైబర్ కేసుల్లో బాధితులకు రూ.72.85 లక్షలు రీఫండ్ చేయించారు. ఈ కేసుల్లో మొత్తం రూ.2.59 కోట్లను సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) కాజేశారు. అయితే అధికారులు రూ.72.85 లక్షలను మాత్రమే రికవరీ చేయగలిగారు. నకిలీ ట్రేడింగ్ యాప్, పార్ట్ టైం జాబ్, వర్క్ ఫ్రం హోమ్ పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. అలాగే సీబీఐ, ఈడీ, కస్టమ్స్ అధికారులమని చెప్పి ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేశారు.
Cyber Fraud | జాగ్రత్తగా ఉండాలి
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అత్యాశకు పోయి మోసపోవద్దన్నారు. ఎవరూ ఊరికే డబ్బులు ఇవ్వరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఉద్యోగాల పేరిట డబ్బులు డిమాండ్ చేస్తే అది ఫేక్ అని గుర్తించాలి. అలాగే ఎవరైనా అధికారుల పేరిట కేసు నమోదు చేస్తామని ఫోన్ చేస్తే భయపడొద్దు. నిజమైన అధికారులు ఎవరూ అలా ఫోన్లు చేయరు. అలాంటి ఫోన్లు వస్తే సైబర్ క్రైం నంబర్(Cyber Crime Number) 1930కు ఫోన్ చేయాలి. లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్(Local Police Station)లో ఫిర్యాదు చేయాలి. సైబర్ మోసానికి గురయినా.. వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేస్తే ఆ డబ్బులను అధికారులు ఫ్రీజ్ చేసి రీఫండ్ చేసే అవకాశం ఉంటుంది.