అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | దారిదోపిడీలు, చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాపై ఎస్పీ రాజేష్ చంద్ర ఉక్కుపాదం మోపారు. ముఠాలో ఉన్న నలుగురు సభ్యులపై పీడీయాక్ట్ నమోదు చేశారు. నిజామాబాద్(Nizamabad) జిల్లా జైలులో ఉన్న నిందితులు చోండా అలియాస్ కూలీ పవార్, జాకీ గుజ్జియా బోస్లే, హరీష్ పవార్ అలియాస్ హర్ష, అనురాగ్ రత్నప్ప బోస్లేలకు శనివారం పీడీ యాక్ట్(PD Act) ఉత్తర్వులు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ ముఠా 9 దారి దోపిడీలు, చోరీలకు పాల్పడిందన్నారు.
SP Rajesh Chandra | ఆగి ఉన్న వాహనాలపై దాడులు..
నిందితులు రోడ్డు పక్కన ఆగిఉన్న వాహనాలపై దాడిచేసి, వాహనాల అద్దాలు పగులగొట్టి వాహనదారులపై కత్తులతో దాడి చేసేవారని ఎస్పీ తెలిపారు. వాహనదారులను బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు, విలువైన వస్తువులను, మొబైల్ ఫోన్లు (Mobile Phones) ఎత్తుకెళ్లేవారని.. రోడ్డు పక్కన ఉండే ఇళ్లల్లో సైతం చోరీలకు పాల్పడేవారని పేర్కొన్నారు. నిందితుల నేరపూరిత చర్యల ద్వారా ప్రజలలో భయాందోళనలు కలుగజేస్తూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగజేస్తున్నారని తెలిపారు. దీంతో వీరిపై పీడీ యాక్టు ప్రయోగించడం జరిగిందన్నారు. ఈ యాక్టుతో నిoదితులు ఒక ఏడాది పాటు జైలులో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. తరచూ నేరాలకు పాల్పడుతూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగజేస్తే పూర్తిగా జైలు జీవితానికి పరిమితమయ్యే అవకాశం ఉందన్నారు.